ఇవి విషరహితమైన పెద్ద పాములు. కాస్తంత వేడి, చెమ్మ ఎక్కువగా ఉండే అడవులు, గడ్డి మైదానాలు, చిత్తడి నేలల్లో నివసిస్తుంటాయి. ఇవి సాధారణంగా 24 అడుగుల వరకు పెరుగుతాయి. సాధారణంగా చిన్న పక్షులు, కోతులు, కోళ్ల వంటి చిన్న జంతువులు మొదలుకుని మేకలు, జింకలు, దుప్పులు, అడవి పందుల పరిమాణంలో ఉండే జీవులను కూడా తింటుంటాయి. ఎర జంతువు చుట్టూ తమ దేహాన్ని చుట్టేసి, దానికి ఊపిరి ఆడనంతగా పట్టు బిగిస్తూ చేసి చంపేస్తాయి. ఎర జంతువు ఎంత పెద్దదైతే జీర్ణమయ్యేందుకు పట్టే సమయం అంతగా పెరుగుతుంది. ఇవి బాగా ఈదగలవు. గ్రీన్ ట్రీ పైథాన్ వంటి కొన్ని జాతులు చెట్లపై నివసిస్తుంటాయి. అవి తమ తోకతో చెట్టు కొమ్మను ఆసరా చేసుకొని మిగతా దేహాన్ని వేలాడదీసి ఎర జంతువుపైకి దాడిచేయగలవు. ఆడ కొండచిలువ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఇలా వీటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కొండచిలువ దాదాపు 25-30 ఏళ్లు బతుకుతుంది.