చిన్నారులూ..! మనం ఇల్లుకట్టాలంటే... సిమెంటు, ఇటుకలను ఉపయోగిస్తాం. కానీ ఓ బామ్మ మాత్రం ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి ఇండ్లను నిర్మించింది. అలా ఒకటో రెండో కాదు ఏకంగా 16 ఇండ్లు నిర్మించి .. ఓ గ్రామానికి రూపకల్పన చేసింది. అందుకే ఇప్పుడా విలేజ్ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.
- బాటిల్స్ విలేజ్ని నిర్మించిన బామ్మ పేరు ట్రెస్సా ప్రిస్బే.. కాలిఫోర్నియా నగరానికి సమీపంలోని సిమీ వ్యాలీలో ఉండేది. ఈ బామ్మకు... చిన్నప్ప ట్నుంచీ పెన్సిళ్లు, బొమ్మల సేకరణ ఓ అభిరుచి. సేకరించిన వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వయసు ముదిరే వరకూ దాచి పెట్టింది. ఆమె దాచుకున్న పెన్సిళ్ల సంఖ్య అక్షరాలా 17 వేలు.
- 1896లో మిన్నెసోటాలో పుట్టిన ట్రెస్సా పన్నెండేళ్ల వరకే బడికెళ్లిందట. 15వ ఏట 35 ఏళ్ల థియోడర్ గ్రినోల్డ్స్తో పెళ్లి జరిగింది. ఆరుగురు పిల్లలు పుట్టారు. భర్త చనిపోయాక 1946లో పిల్లలతో కాలిఫోర్నియాకి వచ్చేసింది. అక్కడ సిమీ వ్యాలీలో ఒక ఎకరం భూమి కొంది. అయితే తను ఉండటానికే కాకుండా, 17000 పెన్సిల్స్ పెట్టేందుకూ ఇంకో ఇల్లు కావాలి. మరెలా?
- అప్పటికామెకు 60 ఏండ్లు వచ్చేశాయి. తన దగ్గర ఇళ్ల నిర్మాణానికి కావాల్సినంత డబ్బులు లేవు. అప్పుడేం చేసిందో తెలుసా! తన స్థలానికి దగ్గర్లోనే ఉన్న డంపింగ్యార్డ్లో వేలకొద్దీ పడివున్న గాజు సీసాలు, ప్లాస్టిక్ సామాను, పనికిరానివస్తువులు ఏరుకు తెచ్చేసేది.
- అలా సీసాలతో ఇంటినిర్మాణానికి నడుం కట్టింది. వాటితోనే అందమైన పొదరిళ్లు కట్టేసింది. ఏ మాత్రం అలసట చెందకుండా ఎకరా స్థలంలో మొత్తం 16 ఇళ్లు నిర్మించేసింది. కాలిబాటల్లో మొజాయిక్ ముక్కల్ని ఏరితెచ్చి అతికించింది. రీసైకిల్ చేసిన వస్తువులతో, పువ్వుల మొక్కలతో ఆ ప్రదేశాన్ని మరింత అందగా తీర్చిదిద్దింది.
- 1880 కల్లా సీసాలతో తయారైన ఆ ప్రదేశాన్ని చూసినవాళ్లంతా 'గ్రాండ్మా ప్రిస్బ్రేస్ బాటిల్ విలేజ్' అని పిలిచేవారు. ఓ రెండేళ్లు దగ్గరే ఉండి పర్యాటకుల్ని అనుమతించింది. కానీ 1982లో ఆరోగ్యం సహకరించక ట్రెస్సా.. శాన్ఫ్రాన్సిస్కోలోని తన కూతురింటికి వెళ్లిపోయింది. 1984లో భూకంపం వల్ల ఆ సీసాల గ్రామం పాక్షికంగా దెబ్బతింది. దాని పునర్నిర్మాణం, సంరక్షణ కోసం 1986లో తన ఆస్తి మొత్తాన్ని బాటిల్ విలేజ్ కమిటీకి బహుమతిగా ఇచ్చేసింది. 1988లో ఆరోగ్యం క్షీణించి ట్రెస్సా కన్నుమూసింది.
- ఆ తరువాత ఆమె కట్టించిన బాటిల్ విలేజ్ మంచి పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. జానపదకళకు అద్దం పట్టేలా ఉంటుందని, చారిత్రక కట్టడాల జాబితాలోకి చేర్చారు. ప్రస్తుతం చాలామంది తల పెడుతున్న ప్లాస్టిక్ సీసాలతో ఇండ్ల నిర్మాణానికి ఈ బామ్మగారి బాటిల్ విలేజే స్ఫూర్తి కావచ్చు.
Authorization