హాయ్ పిల్లలూ! మనం పక్షులు మాత్రమే గాలిలో ఎగురుతాయనుకుంటాం. అలా పక్షులే కాకుండా వేరే జీవులు కూడా కొన్ని గాల్లో ఎగురుతాయి. నమ్మట్లేదా.. ఇది చదివేయండి.
చేపలు
పక్షుల్లా ఒకేసారి చాలా దూరం ఎగరలేవు. అయినా ఆహారాన్ని వేటాడేందుకు మాత్రం కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి కొన్ని చేపలు. బటర్ఫ్లై ఫిష్, హ్యాచ్ ఫిష్లు ఈ కోవకు చెందుతాయి. గాల్లో తిరిగే కీటకాలని పట్టుకునేందుకు నీటిలోంచి దూసుకొచ్చి వాటిని పట్టేసుకుంటాయి. పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని నదులు, దక్షిణ అమెరికా మంచినీటి సరస్సులు వీటికి ఆవాసాలు. ఇవే కాకుండా సముద్రాల్లో కూడా ఎగిరే చేపలుంటాయి. ఇవి కాస్తంత ఎక్కువ ఎత్తు వరకూ ఎగరగలవు.. వీటి సంఖ్య ఎక్కువున్నా ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో ఈ రకం చేపలుంటాయి. మొదట నీటి మీద పరిగెడుతున్నట్లే వేగంగా ఈదుకుంటూ చాలా దూరం పోతాయి. ముందు భాగంలో రెక్కల్లా ఉండే మొప్పల్ని చాపి అప్పుడు గాల్లోకి లేస్తాయి. ఎగరాలనుకున్నప్పుడు వీటి శరీరంలో ఉండే కండరాల సహాయంతో ఆ మొప్పలు రెక్కల్లా విచ్చుకుంటాయి. నీటిలోకి చేరగానే ముడుచుకుపోతాయి.
ఉడతలు
ఒక చెట్టు మీద నుంచి వేరే చెట్టుపైకి సునాయాసంగా ఎగిరేస్తాయివి. వీటినే ఎగిరే ఉడతలు అంటారు. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా (కొన్ని ప్రాంతాల్లో)ల్లో ఉంటాయి. ఇవెలా ఎగురుతాయో తెలుసా? ఈ ఉడతల ముందు వెనుక పాదాలకు వేళ్ల మధ్య పొరలా ఉంటుంది. అయితే ఉడతల మీద గద్దలు, కాకులు వంటివి దాడి చేస్తుంటాయి. అటువంటప్పుడు ఈ రకం ఉడతలైతే కాళ్లను చాపి దూకుతాయి. అప్పుడా కాలికుండే పొరలు రెక్కల్లా పనిచేసి ఎగిరేందుకు సహకరిస్తాయి. అలా ఎగిరి చెట్ల కొమ్మల్లో దాక్కుంటాయి. ఎందుకంటే.. ఇవెప్పుడూ మామూలు ఉడతల్లా కిందకి రావు. వీటి ఆహారం పళ్లు, కాయగూరలు, క్రిములు. ఇవి నిశాచరులు కూడా. రాత్రిపూటే బాగా చూడగలవు. ఇవి ఒకేసారి రెండొందల అడుగుల వరకు కూడా ఎగరగలవు.
పాములు
ఇవి పాములన్నిట్లోకి భిన్నమైనవి. చాలా విషపూరితమైనవి కూడా. పక్షుల్లా రెక్కలు లేకపోయినా కాస్తంత దూరం ఎగరగలవు. ఎలాగంటే.. ముందు వీటి శరీరాన్ని నిటారుగా చేస్తాయి. దాంతో మధ్యభాగం ఉబ్బెత్తుగా, కింద వైపు పల్లంగా విశాలంగా అవుతుంది. ఆ విధంగా తయారైన శరీరం గాల్లో నిలకడగా నిల్చుంటుంది. ఒక చెట్టుకొమ్మ నుంచి వేరే దగ్గరకు చేరాలంటే ఈవిధంగా గాల్లో తేలుతూ వెళ్ల గలదు. వీటిలో రెండు రకాలుంటాయి. యూరోపెల్టిడియా అనే రకం పాములు అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ ఆసియా, ఈస్టిండీస్ దీవులు, శ్రీలంక, భారత్ దేశాల్లో నివసిస్తాయి. క్రిసోపిలియా ఆర్నెటా (పసిరిక పాములు) నలుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇవి భారత్, శ్రీలంకల్లో మాత్రమే జీవిస్తాయి.
నక్కలు
నక్కలంటే నిజంగా నక్కలనుకుంటున్నారా? అచ్చం వాటిలా ఉండే ఓ రకం గబ్బిలాలివి. అందుకే వీటికి ఆ పేరొచ్చింది. మామూలు గబ్బిలాలు చూడ్డానికి చిన్నగా, చుంచెలుకల్లా ఉంటాయి కదా! ఈ జాతి గబ్బిలం మాత్రం చిన్నపాటి కుక్కలా ఉంటుంది. రెక్కల పొడవెంతో తెలుసా? ఆరడుగులు. నోట్లో పదునైన పళ్లుంటాయి. వాటితో కొబ్బరి బొండాన్ని కూడా ఇట్టే ఒలిచేస్తాయి. వీటి అలవాట్లు, ప్రవర్తన మాత్రం గబ్బిలాల్లానే ఉంటుంది. ఈ ఎగిరే నక్కలెక్కువగా పండ్ల తోటల్లోనే ఉంటాయి. ఎందుకంటే ... వీటికి పండ్లంటే చాలా ఇష్టం. ఏ ప్రాంతంలో ఉంటాయంటే ఆస్ట్రేలియా, మలేషియా, ఆసియా దేశాలన్నిటిలోన్లూ. ఇంకా పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లోని కొన్ని ద్వీపాల్లో కూడా నివసించే ఇవి వేలకొద్దీ గుంపులుగా తిరుగుతుంటాయి. మామూలు గబ్బిలాలకి చూపు సరిగా ఆనక శబ్దం మీద ఆధారపడతాయి. ఇవి మాత్రం కండ్లతో బాగా చూడగలవు.
Authorization