హాయ్ నేస్తాలూ...! ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ప్రతీ భవనానికి ఒక చరిత్ర ఉంటుంది. ఒక ఆదర్శం కావచ్చు, ఏదైనా స్మృతి చిహ్నం కావచ్చు.. లేదంటే విభిన్నంగా ఉండాలనే కోరిక కావచ్చు... ఇలా ప్రతి భవనానికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఈ భవనానికి కూడా ఓ చరిత్ర ఉంది... ఒక పోస్ట్‌మెన్‌కు కనిపించిన చిన్న రాయే ఇంత పెద్ద నిర్మాణానికి నాందిగా మారింది. అదే ఐడియల్ ప్యాలెస్‌గా పేరొందింది.
- ఫ్రాన్స్‌కి చెందిన ఫెర్డినాండ్ చేవల్ ఒక సాధారణ పోస్టుమేన్. హౌతెరవిస్ అనే గ్రామంలో ఓ నిరుపేద రైతు కుటుంబంలో 1836లో పుట్టాడు చేవల్. ఇల్లు గడవటం కోసం 13 ఏళ్ల వయసులోనే చదువు మానేసి ఒక బేకరీలో పనికి చేరాడు.
- 1867లో చేవల్కి తపాలా శాఖలో పోస్ట్‌మేన్ ఉద్యోగం వచ్చింది. రోజూ ఊరంతా తిరిగి ఉత్తరాలను పంపిణీ చేసేవాడు. ఓ రోజు ఉత్తరాలు పంచడానికి వెళుతుండగా చేవల్ కాలికేదో తగిలింది. తీసి చూస్తే అదొక చిన్నరాయి. పరీక్షగా చూస్తే వింతగా కనిపించింది. దాన్ని జేబులో వేసుకుని చక్కా పోయాడు. ఆ రాత్రి అతనికో కలొచ్చింది. దాంట్లో రాళ్లతో కట్టిన వింత ప్యాలస్ కనిపించింది. ఆయనకి చాలా ఆశ్చర్యమేసింది. పొద్దుట తనకు దొరికిన రాయిలాంటి రాళ్లతో కట్టిన భవనమది. వెంటనే ఆయనకో ఆలోచన వచ్చింది. నిద్రలేవగానే రాయి దొరికిన చోటుకి వెళ్లాడు. వెతికితే అలాంటివే మరికొన్ని రాళ్లు దొరికాయి. వాటిని జేబుల నిండా నింపుకుని ఇంటికొచ్చాడు. కలలో కనిపించిన ప్యాలస్ లాంటిదే తనూ కట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అంతే దాని కోసం పనులు మొదలుపెట్టేశాడు.
- అలా రాళ్ల సేకరణకే రెండేళ్లు పట్టింది. 1879 తనకు 43 ఏండ్లప్పుడు నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అలా ఎన్నేళ్లు నిర్మించాడో తెలుసా! 33 సంవత్సరాలు. బయటి గోడలు కట్టేందుకే 20 ఏళ్లు పట్టింది. దీని కోసం 3,500 సున్నపురాయి బస్తాలు అవసరమయ్యాయి. వైరును కూడా ఉపయోగించాడు. పగలు, తపాలా పనులు చూసుకుంటూ, రాత్రి చమురు దీపపు వెలుతురులో పనిచేసేవాడు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతేంటంటే! అంత పెద్ద భవన నిర్మాణానికీ ఎవరి సహాయమూ తీసుకోలేదు. ప్రపంచంలో ఒక్కరి చేతుల మీదుగా నిర్మాణం కొనసాగిన కట్టడం బహుశా ఇదొక్కటేనేమో!
- ఈ భవనం ప్రత్యేకతలేంటంటే.. తాను చిన్నప్పుడు చదివిన కథల్లోని హిందూ దేవాలయం, స్విస్ చర్చ్, ముస్లింల మసీదు, మరికొన్ని మతాల గుడుల ఆకృతులను రాళ్లతోనే తన భవనం గోడలపై రూపొందించాడు. చైనా, జపాన్, యూరప్ లాంటి వివిధ దేశాల నిర్మాణ శైలుల రూపాలను తీర్చిదిద్దాడు.
- 1896లో ఉద్యోగ విరమణ తర్వాత చేవల్ తన పూర్తి సమయాన్ని దీని నిర్మాణానికే వెచ్చించాడు. 1912లో తన 76 సంవత్సరాలప్పుడు దాన్ని అనుకున్న రీతిలో పూర్తిచేశాడు. అతణ్ణి హేళన చేసిన వాళ్లే ముక్కున వేలేసుకునేంత అందంగా తయారయిందా సౌధం.
- చేవల్ 1924లో మరణించాడు. అతని జ్ఞాపకార్థం అతని బొమ్మను ఆ గోడలపై చెక్కించారు. 1986లో అతని చిత్రంతో ఫ్రెంచ్ ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. ప్రపంచంలోని పేరెన్నికగన్న కట్టడాల జాబితాలో ఈ సౌధాన్ని చేర్చింది.
- 1969లో ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ కట్టడానికి 'ఐడియల్ ప్యాలెస్' అని పేరుపెట్టి రక్షణ కల్పించారు. ఎందుకంటే.. ఇంత గొప్ప కట్టడాన్ని చూడ్డానికొచ్చే సందర్శకుల తాకిడి ఎక్కువే ఉంటుంది మరి!
Authorization