హాయ్ పిల్లలూ! మనం అప్పుడు టీవీల్లో చూస్తుంటాం... చిలుకలు ముద్దుముద్దుగా మాటలు చెబుతుంటాయి. ఏం చెబితే అవి పలుకుతుంటే మనం ఎంతో ఆసక్తిగా చూస్తాం. అయితే వాటికి ఆ మాటలకు అర్థాలు మాత్రం తెలియవు. అలా కొన్ని రకాల జాతుల చిలుకలు మాత్రమే మనల్ని అనుకరిస్తాయి. వాటిల్లో కొన్ని...
ఆఫ్రికన్ బూడిద చిలుక ( ప్సి ట్టకస్ ఎరిథాకస్)
మాట్లాడే పక్షి జాతుల్లో స్పష్టంగా మాట్లాడే పక్షులివే. అంతేకాదు అత్యంత తెలివైనవి కూడా. ఆఫ్రికాలోని కామెరూన్, కాంగో, కెన్యా, ఉగాండాల్లో దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. మనుషులకి తొందరగా మచ్చికవుతాయి. దాదాపు 1000 నుంచి 15 వందల మాటల్ని సునాయాసంగా పలికేస్తాయి.
ఇండియన్ రింగ్ నెక్ ప్యారట్ (స్పిట్టాకులా క్రేమర్)
ఇవి ఆఫ్రికా-ఆసియా దేశాల్లో, బంగ్లాదేశ్, పాకిస్థాన్, బర్మా, నేపాల్ల్లో నివసిస్తాయి. మనుషుల ఆవాసాలకు దగ్గరగా సంచరించే వీటినే మనదేశంలో రామచిలుకలంటాం. మాటల్ని అర్థం చేసుకుని అనుకరించడంలో వీటికివే సాటి.
ఎల్లో హెడెడ్ అమేజాన్ (అమేజాన్ ఒనాట్రిక్స్)
ఉత్తర మధ్య అమెరికా అమేజాన్ అడవుల్లో జీవిస్తాయి. వీటి గొంతు శక్తిమంతంగా ఉంటుంది. పాటల్ని వల్లె వేస్తూనే ఉంటాయి. సూర్యోదయ వేళల్లో ఎక్కువగా అరుస్తూ పాటలు పాడుతుంటాయి. టీవీ, రేడియో పాటల్ని విన్నా నేర్చేసుకుంటాయి.
మేటాడేటా (మెలోప్పిటకస్ అన్డలటస్)
ఈ బుజ్జి పక్షులకి బడ్జియేకి, షెల్, జీబ్రా చిలకలనే పేర్లున్నాయి. రంగు రంగుల్లో ఉండే ఈ చిట్టి ముక్కు చిలకలు ఆస్ట్రేలియాలో ఉంటాయి. గుంపులుగా తిరుగుతుంటాయి. ప్రపంచంలోని ఐదు ఎక్కువగా మాట్లాడగల జాతుల చిలుకల్లో ఇవీ ఉన్నాయి.
కాకాటూ (కాకాటోడియా)
న్యూజిలాండ్, టాస్మానియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సోలమన్ దీవుల్లో నివసిస్తాయి. వీటి గొంతు కఠినంగా, బిగ్గరగా ఉంటుంది. ఇవి పదాలను, ధ్వనుల్ని కూడా అనుకరిస్తాయి. శబ్దాల స్థాయిని బట్టి పలుకడంలో ఇవి నేర్పరులు. నేర్చిన పదాలను సమయానుకూలంగా పలుకుతుంటాయి.
మాంక్ పరాకీట్ (మైయోప్పిట్ట మొనాకస్)
వీటినే క్వేకర్ చిలుకలంటారు. ఇవి అర్జెంటీనా ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోనూ, ఉత్తర-దక్షిణ అమెరికా, యూరప్ల్లోనూ జీవిస్తాయి. ఇవి అడవుల్లో కొండ పగుళ్లలో గూళ్లు కట్టుకుంటాయి. అందుకే కొండ చిలుకలనీ పేరు. ఇవి చాలా తెలివిగలవి. పెద్ద పెద్ద పదాలను సైతం ఒకసారి వింటే చెప్పేస్తాయి. ఈ సామర్థ్యం వల్లే వీటి ధర చాలా ఎక్కువ.
ఆస్ట్రేలియన్ కింగ్ ప్యారట్ (అలిస్టేరస్ స్నిపులర్పి)
ఎరుపు ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయివి. ఎక్కువగా తూర్పు ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్స్ నుంచి, దక్షిణ విక్టోరియా వరకూ ఉంటాయి. వర్షారణ్యపు అడవుల్లో నీలగిరి చెట్లు ఉన్నచోట సంచరిస్తుంటాయి. ఎక్కువ పదాలను నేర్చుకోవడంలో ఈ పక్షులు నేర్పరులు.
Authorization