ప్రపంచంలో మొత్తం తొంభై రకాల కింగ్ఫిషర్ జాతులున్నాయి. అయితే వాటిలో ముఖ్యమైన మూడు... రివర్ కింగ్ఫిషర్, వాటర్ కింగ్ ఫిషర్, ట్రీ కింగ్ఫిషర్. నీరు తాగకుండా ఇవి ఎక్కువ సేపు ఉండలేవు. అందుకే ఇవి నీటికి దగ్గర్లోనే జీవిస్తుంటాయి. అయితే ఇవి ఏ నీరు పడితే ఆ నీటిని తాగవు. నీరు పరిశుభ్రంగా ఉండాలి. ఇవి చాలా చిన్నవిగా, బలహీనంగా ఉంటాయి. కాబట్టి శత్రుభయం ఎక్కువ. అయితే వీటి ముక్కు చాలా బలంగా, పొడవుగా, సూటిగా ఉంటుంది. కత్తిలా పదునుగా దిగుతుంది. అదే కింగ్ఫిషర్లకు రక్షణ ఆయుధం. వీటి ప్రధాన ఆహారం చేపలు. నీటి అడుగుకు వెళ్లి కూడా ఇవి వేటాడగలవు. వాటి కళ్ల నిర్మాణం నీటి అడుగున ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలిగేటట్లు ఉంటుంది. మంచు అడుగున ఉన్న చేపల్ని కూడా ఇవి పసిగట్టేస్తాయి. పదునైన బలమైన ముక్కుతో మంచును తవ్వి మరీ చేపల్ని పట్టుకుంటాయి. ఆహారం దొరకనపుడు ఇవి దౌర్జన్యానికి దిగుతాయి. వేరే పక్షులతో పోట్లాడి వాటి ఆహారాన్ని లాక్కుని తింటాయి. కొన్నిసార్లు వాటి గూళ్లనుంచి ఆహారాన్ని దొంగిలిస్తాయి కూడా. కింగ్ఫిషర్లు కుటుంబానికి చాలా ప్రాముఖ్యతనిస్తాయి. జంట పక్షిని, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. గుడ్లు పెట్టిన నాటి నుంచి మగపక్షి ఆహార వేటకు వెళ్తుంది. గుడ్లుపొదగడం, పిల్లల్ని సాకడం ఆడపక్షి చూసుకుంటుంది. వీటి జీవితకాలం రెండు సంవత్సరాలు.
Authorization