మనం సముద్రాల్లో పడవేసుకుని షికారుకెళ్లాలంటే పొద్దు పోకముందే వెళుతుంటాం. కానీ ఓ చోటకి మాత్రం చీకటిపడగానే పడవల్లో బయలుదేరుతారు. ఎందుకో తెలుసా? రాత్రిళ్లు ఆ నీరుని ముట్టుకుంటే చాలు.. ధగధగా మెరిసిపోతుంది. పడవ కదులుతున్న కొద్దీ జిగేల్మంటూ మెరుపులు వస్తాయి. అదేదో వెలుగే... పడవని వెంబడి వస్తున్నట్టు వింత అనుభూతి కలుగుతుంది. ఇంతకీ ఎక్కడో చెప్పలేదూ కదూ... ప్యూర్టోరికోలోని వియెక్స్ దీవి సముద్రతీరంలో. ఈ వింత తీరువల్ల ఈ బీచ్‌ని మ్యాజికల్ బయోల్యూమిని సెంట్బే అంటూ పిలుస్తారు. ఆ తళుకులు ఏంటీ అంటే... ఈ నీటిలో లక్షల సంఖ్యలో పైరోడినియమ్ బహమెన్సె, డైనోఫ్లాగెల్లటెస్ అనే ప్రత్యేకమైన జీవులుంటాయి. వీటిని వేరే జీవులు తాకినా, కదిలించినా అలా కాంతులు వెదజల్లుతూ మెరిసిపోతాయన్నమాట. కారుచీకట్లలో వీటి కాంతి మరీ ఎక్కువ.