పిల్లలూ! గ్రంథాలయాలకు ఎందుకు వెళ్తాం..? పుస్తకాలు చదువుకోవడానికే కదూ... కానీ ఈ గ్రంథాలయాలను మాత్రం చూడ్డానికే వెళ్తున్నారు.. ఎందుకంటారా? ఇవి పుస్తక ప్రియులకు విజ్ఞానాన్ని పంచడమే కాకుండా అందంగానూ ఉంటాయి. అందుకే పర్యాటకులూ క్యూ కడుతున్నారు. ఇంతకీ అవి ఎక్కడున్నాయో.. వాటి విశేషాలేంటో తెలుసుకుందామా...
- ఈ గ్రంథాలయం పేరు 'బుక్మౌంటెన్'. అంటే పుస్తక పర్వతం అన్నమాట. పేరుకు తగ్గట్టే ఈ గ్రంథాలయం పర్వతం ఆకారంలో ఉంటుంది.
- దీన్ని 2012లో నెదర్లాండ్స్‌లోని స్పిజ్కెనిస్ అనే ఊళ్లో ఎమ్.వి.ఆర్.డి.వి. అనే సంస్థ నెలకొల్పింది. ఈ గ్రంథాలయం విస్తీర్ణం 9,300 చ.మి. అయిదంతస్తుల మేడలో అలమరలు కట్టి పుస్తకాలను అమర్చారు.
- ఈ అలమరలను ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థాలతో చేశారట. ఎందుకంటే అగ్నిప్రమాదమేదైనా జరిగితే పుస్తకాలు కాలిపోకుండా ఉండేందుకు. అలమరలన్నీ కలిపి చూస్తే దాదాపు 3,205 మీటర్ల పొడవున్నాయి. తెలుసా! దీనిలో 70 వేలకుపైగా పుస్తకాలున్నారు! పిల్లలకూ, పెద్దలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే అన్ని రకాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
- పుస్తకాలన్నీ బయటికి కనిపించేలా గోడలన్నీ గాజుతో కట్టారు. పైకప్పును పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. అంతేకాదు! ఇందులో గుడిసెలాగా మరో నిర్మాణం ఉంది. అది పూర్వం అక్కడ నివసించిన వ్యవసాయ కుటుంబాల ఇండ్లను పోలి ఉంటుందట. ఇక్కడకు చదువుకోవడానికంటే చూడ్డానికే ఎక్కువమంది వస్తుంటారు. అందుకని చదివేందుకు వీలైన వసతులతో పాటుగా సమావేశ గదులు, చెస్ క్లబ్బులు, ఆడిటోరియం లాంటివి కూడా ఇందులో కట్టారు. ఈ గ్రంథాలయం బెస్ట్ లైబ్రరీ ఇన్ ది నెదర్లాండ్స్, డచ్ ఉడ్ అవార్డు-2012, రెడ్ డాట్ డిజైన్ అవార్డు-2013 ఇలా బోలెడు పురస్కారాలను సొంతం చేసుకుంది.
- చెక్‌రిపబ్లిక్ దేశంలోని ప్రేగ్ నగరంలో ఉన్న 'క్లెమెంటియం' గ్రంథాలయం రాజభవనాన్ని తలపిస్తుంది. పుస్తకప్రియులు, సాహిత్యాభిమానులే కాదు సామాన్య జనం కూడా ఆ గ్రంథాలయానికి క్యూ కడుతుంటారు.
- గ్రంథాలయంలోని గోడలపై ఉన్న అందమైన కళారూపాలు అందరిని ఆకట్టుకుంటాయి. పైకప్పు కూడా పెయింటిగ్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రీకు కథల ఆధారంగా ఈ చిత్రాలను గీశారు. దీన్ని ఫ్రెస్కో పెయింటింగ్ అంటారు. వీటిని 'జాన్ హిబ్ల్' అనే చిత్రకారుడు చిత్రించాడు. పుస్తకాల అరలు ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. గ్రంథాలయంలో ఎటు చూసినా ఆకట్టుకునే కళాఖండాలే దర్శనమిస్తాయి.
- జీసుట్ విశ్వవిద్యాలయ నిర్మాణంలో భాగంగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1722 సంవత్సరంలో ప్రారంభించారు. బరోఖ్ నిర్మాణ శైలీలో నిర్మించిన ఈ భవన సముదాయ విస్తీర్ణం దాదాపు 5 ఎకరాలు.
- చెక్ రిపబ్లిక్కు సంబంధించిన వివిధ సాహిత్య పుస్తకాలు, ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు వందల ఏళ్ల నాటి చారిత్రక పుస్తకాలను, గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ చారిత్రక గ్రంథాలన్నింటిని డిజిటలైజేషన్ చేసేందుకుగానూ గూగుల్ సంస్థకు పంపించారు. ఈ గ్రంథాలయంలో దాదాపు 20,000 పుస్తకాలు ఉన్నాయి. విదేశీ సాహిత్య పుస్తకాలతో పాటు, అరుదైన పుస్తకాలను ఇక్కడ చదవవచ్చు.
Authorization