పిల్లలూ...! బొమ్మిడాయి పేరు మీరు వినే ఉంటారు... ఈ రకమైన చేపలు తినడానికి ఎంతో రుచిగా ఉండటంతో పాటు.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. మరి వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా...
- ఇవి అనిమేలియా రాజ్యానికి, బొటిడారు కుటుంబానికి చెందినవి. బొమ్మిడాయిలు ఇక్కడా... అక్కడా అని కాకుండా ప్రపంచమంతటా వివిధ రూపాల్లో లభిస్తాయి. భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, మలేసియా, చైనా, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయి. అమెరికా, ఐరోపాల్లోనూ లభిస్తాయి.
- బొమ్మిడాయిలు సన్నగా, పొడుగ్గా ఈల్ చేపలను పోలి ఉంటాయి. దాదాపు జానెడు నుంచి రెండు మూరల పొడవు ఉంటాయి. సన్నగా ఉండటంతో బరువు తక్కువగా ఉంటాయి. రకాల్ని బట్టి వెండి, బంగారు, నలుపు, ఎరుపు రంగు చారలతో పొలుసు ఉంటుంది.
- ఇవి నిదానంగా ప్రవహించే నదుల్లో, మంచినీటి సరస్సుల్లో, స్వచ్ఛమైన నీరుండే కుంటల్లో గుంపులు గుంపులుగా జీవిస్తాయి. చేపల్లో ఇదొక సంఘజీవి అని చెప్పొచ్చు. నీటిలో 24-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బతుకుతాయి. నీటి గాఢత మరీ ఎక్కువ, తక్కువ ఉండకూడదు.
- బొమ్మిడాయిలు ఆల్గే, పాకురు తింటూ బతుకుతాయి. నీటి తొట్టిలో ఉండేవైతే వాటి మేత ప్రత్యేకంగా ఉంటుంది. బొమ్మిడాయిలు పగటి కన్నా రాత్రుళ్లు చురుగ్గా కదులుతాయి. నీటి తొట్టిలో ఎవరైనా వేలు పెడితే దాంతో ఆడుకుంటాయి కూడా.!
- వీటి పెంపకం మంచి లాభసాటి వ్యాపారం. అందుకే బొమ్మిడాయిలను సేద్యం చేస్తారు. జపాన్, మలేసియా, థారులాండ్ తదితర దేశాల్లో వీటి సేద్యం ఎక్కువ. కోట్ల రూపాయల్లో వాణిజ్యం జరుగుతుంది.
- మనదేశంలో పశ్చిమ్ బంగ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేద్యం చేస్తారు. ఎక్కువగా తింటారు.
- తొట్టిలో పెంచే కొన్ని రకాల బొమ్మిడాయిలు గోల్డ్ఫిష్తో స్నేహం చేస్తాయి. వీటికి హైడ్ అండ్ సీక్ అంటే చాలా ఇష్టం. నీటి తొట్టిలో వైవిధ్యమైన అలంకరణలు చేస్తే అందులో దాక్కుంటాయి. బయటకు వస్తూపోతూ ఆనందాన్ని ఇస్తాయి.
- తెలుగు రాష్ట్రాల్లో బొమ్మిడాయిల పులుసుకు చాలా ప్రాముఖ్యం ఉంది. అన్ని జిల్లాల్లో వీటిని ఇష్టంగా తింటారు. పచ్చి చేపలు, ఎండు చేపలు రెండు రకాలుగా దొరుకుతాయి.
- బొమ్మిడాయిలు చక్కని ఆహారం. అన్ని దేశాల్లోనూ వీటిని ఆహారంగా తీసుకుంటారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ తింటారు. ఉత్తర భారతదేశంలో విరివిగా తింటారు. జపాన్, థాయ్ వంటకాల్లో బొమ్మిడాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు.
- బొమ్మిడాయిల్లో పోషక విలువలు ఎక్కువ. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, ఆమ్లాలు శారీరక వృద్ధికి చాలా అవసరం. బొమ్మిడాయిల్లోని విటమిన్ -డి చర్మకణాలను పరిరక్షిస్తుంది. సూర్యకాంతి నుంచి పొడిబారకుండా కాపాడుతుంది. కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. విటమిన్-ఎ కంటిచూపు పెంచుతుంది. ఈ చేపల్లో ఒమేగా ఫ్యాటీ 3 ఆసిడ్స్ ఉంటాయి.
Authorization