ఒంటి మీద ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా మనకు ఎంతో బాధ కలుగుతుంది. కానీ గోళ్లు, వెంట్రుకలు మన శరీరంలో భాగాలే కదా, వాటిని కత్తిరిస్తే నొప్పి ఎందుకు పుట్టదంటారు? ఎందుకంటే గోళ్లు అనేవి మృతకణాలతో నిండిన ఒక గట్టి పదార్థం. గోళ్ల కింది చర్మం ఇతర శరీర భాగాల్లో ఉండే చర్మం లాగానే ఉంటుంది. వీటి మొదలు వేళ్లలోని చర్మం లోపల కొంత లోతు వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక ప్రత్యేక కణజాలం ఉండటం వల్ల ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి. మొదలు నుంచి ఇవి రోజూ కొద్ది మేరకు పెరుగుతూ ఉంటాయి. ఇవి మృతకణాలతో నిండి ఉన్నాయని చెప్పుకున్నాం. కనుక వీటిని కత్తిరించినా మనకు నొప్పి, బాధ ఉండవు, అదే కొంచెం లోపలికి కత్తిరించామనుకోండి. లేదా కొరికామనుకోంది అప్పుడు భరించలేనంత బాధ ఉంటుంది. ఇక వెంట్రుకల విషయానికి వస్తే ... ఇవి కూడా గోళ్లలాగే కెరాటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. వీటి చివర్లు కూడా నరాలతో అనుసంధానమై ఉండవు. అందుకే వీటిని కత్తిరించినప్పటికీ రక్తం రాదు, నొప్పి, బాధ కలగవు. అయితే వెంట్రుకలను మొదళ్ల దగ్గర పట్టుకుని లాగితే మాత్రం నొప్పి, బాధ ఉంటాయి. ఎందుకో తెలుసు కదా, మొదళ్లలో కణజాలం ఉంటుంది. అవి మృతకణాలు కావు కదా మరి.
Authorization