నేస్తాలూ..! విలువైన లోహం ఏదంటే...? బంగారమని ఠక్కున చెప్పేస్తారు...మరి అంతకన్న విలువైన లోహం మరోటుందని మీకు తెలుసా.. అదే ప్లాటినం... ఈరోజు మనం ఈ లోహ విశేషాలే తెలుసుకోబోతున్నాం.
- అచ్చు వెండిలానే కనిపిస్తున్న ఈ లోహం చాలా విలువైన, ఇంకా అరుదైన లోహం. వాణిజ్యపరంగా బంగారం కంటే ఈ లోహం ఎంతో ఖరీదైనది. దీనిని తెల్లబంగారం అని పిలుస్తారు.
- దీని పరమాణు సంఖ్య 78 గాను, చిహ్నం జ్ూ గాను పరిగణనలో ఉంది. ప్లాటినంను హఠాత్తుగా చూస్తే వెండిలా కనిపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి బూడిదరంగు, తెలుపు ఛాయలో ఉంటుంది. ఇది దక్షిణాఫ్రికా, రష్యాలలో ఎక్కువగా దొరుకుతుంది. తమిళనాడులో కూడా వీటి నిక్షేపాలున్నట్లు కనుక్కున్నారు.
- 16వ శతాబ్దంలో కరీబియన్ సముద్రంలోని గ్రెనెడా ద్వీపంలో బంగారాన్ని వెలికితీస్తోంటే తెల్లని లోహపు ముద్దలు కనిపించేవట. వాటిని బంగారం నుంచి కష్టపడి వేరుచేసి, చెత్తలా పక్కన పడేసేవారు. ఎందుకంటే అది ప్లాటినం అని గాని, బంగారం కన్నా విలువైన లోహం అనిగాని వాళ్లకు తెలియదు. స్పెయిన్ భాషలో ప్లాటా అంటే వెండి అని అర్థం. అందుకని వాళ్లంతా ఈ లోహాన్ని ప్లాటినాగా పిలిచేవారు. చాలా సంవత్సరాలు ఈ తెల్లని లోహానికి అసలు వెలకట్టలేదట.
18వ శతాబ్దంలో ఈజిప్ట్ సమాధులలోని ఆభరణాలలో బంగారంతో పాటుగా మళ్లీ ప్లాటినం కనిపించింది. యూరప్ శాస్త్రజ్ఞులకు ఈలోహం ఏంటో అంతుబట్టలేదు. దీనిగురించిన అవగాహన గాని, దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో కూడా వాళ్లకి తెలిసేది కాదు.
- అయితే ప్లాటినం గురించి తెలియడం 18వ శతాబ్దంలో ప్రారంభం అయినా క్రీ.పూ. 700 నాటికి ప్లాటినంతో తయారుచేసిన వస్తువులు అప్పటి తవ్వకాల్లో బయటపడ్డాయట. అందులో ముఖ్యమైనది క్యాస్కెట్ ఆఫ్ థేబ్స్. ఈ చిన్న పెట్టె ఆధారంగానే ప్లాటినం చాలా పురాతనమైన లోహమని చెప్తారు. ఎలాగంటే ఆ పెట్టె మీద బంగారం, వెండి ఇంకా ప్లాటినం మిశ్రమ లోహంతో చేసిన బొమ్మల లిపి ఉంది. అప్పుడు ప్లాటినాన్ని అరుదైన, అత్యంత విలువైన లోహంగా గుర్తించారు.
- బంగారంలాగే ఇది ఎందులోనూ కరగదు. అందుకనీ బంగారానికి రాగిని ఎలా కలుపుతారో, అలాగే ప్లాటినాన్ని రేకులుగా మార్చేందుకు 'తాలము' (ఆర్సెనిక్) కలుపుతారు.
ఉపయోగాలు
- ప్లాటినాన్ని ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడుతారు.
- ప్రయోగశాలల్లో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించే పాన్లు, ఇంకా పాత్రలు, ఎలక్ట్రోడులను ప్లాటినంతోనే తయారుచేస్తారు.
- వైద్యపరికరాల తయారీకి, విద్యుత్ కనెక్షన్లలోను, చికిత్సల్లోనూ ఇది ఉపయోగపడుతుంది.
- ఓడలు, పైప్లైన్లు, తీరప్రాంతాల్లోనూ నీటిపైన నిర్మించే ప్లాట్‌ఫామ్‌లకు అడుగునున్న స్థంభాలకు ప్లాటినం ఆనోడ్స్ వాడతారు. లేకపోతే నీటితాకిడికి అవి తుప్పు పట్టేస్తాయి.
- వాహనాల నుంచి వెలువడే హానికరమైన కాలుష్య వాయువులలోని విషపదార్థాలను తొలగించేందుకు దీన్ని వాడతారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా వాహన కాలుష్యం కొంత వరకూ తగ్గుతుంది.
Authorization