ఎడారికి దగ్గరగా ఉండే ఓ అడవిలోకి ఒక ఒంటె ఎలాగో ప్రవేశించింది. అక్కడున్న పచ్చటిచెట్లు, గుట్టలు, కాలువలు, రకరకాల జంతువులు, పక్షుల్ని చూసి ఎంతో ముచ్చటపడింది.
అడవిలోని జంతువులక్కూడా ఒంటెని చూస్తే వింతగా అనిపించింది. దాని పొడవాటి మెడ, పొడుగైన కాళ్లు, ఎత్తైన మూపురం చూసి ఆశ్చర్యపోయాయి.
ఆ అడవికి ఓ జిత్తులమారి నక్క మంత్రి. మృగరాజుకి తెలియకుండా అమాయక జీవుల్ని మోసం చేసి జీవించేది. తన జిత్తులతో మృగరాజుని మంచి చేసుకునేది. ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది. మృగరాజు కోపంతో వాటిని చంపేస్తే వాటి మాంసాన్ని తినేది.
కొత్తగా వచ్చిన ఒంటెను చూసింది నక్క. మొదట ఆ ఆకారం చూసి భయపడినా సాధుజంతువని తెలిసి ధైర్యమొచ్చేసింది. 'ఏరు! ఎవరు నువ్వు! ఇక్కడికెందుకొచ్చావ్?' అని ప్రశ్నించింది.
'మిత్రమా! నేను ఎడారి జీవిని. నా పేరు ఒంటె. అడవిని చూడాలని వచ్చాను' అంది.
'అలాగా! మా రాజ్యంలోకి వచ్చేముందు మృగరాజు సింహం అనుమతి తీసుకోవాలి. నువ్విక్కడే ఉండు. నేవెళ్లి నీ విషయం రాజుకి చెప్పివస్తా' అంది నక్క.
పరుగున మృగరాజు వద్దకు వెళ్లింది. 'మృగరాజా! పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఒంటె అనే ఎడారి జంతువొకటి అడవిలోకి ప్రవేశించింది. చాలా భయంకరంగా ఉంది. మీ కోసం వెతుకుతోంది' అంటూ రొప్పుతూ, ఆయాసపడుతూ కంగారుగా చెప్పింది నక్క.
'భయపడకు! దాని సంగతి చూద్దాం పద' అంటూ గర్జించింది సింహం.
'వద్దు ప్రభూ వద్దు! అది మీకన్నా ఎత్తుగా బలంగా ఉంది. ఈ రాజ్యానికి అదే రాజుగా ఉండాలని దాని కోరికట' చెప్పింది నక్క.
లేనిపోని అబద్దాలన్నీ చెప్పి ఒంటె మీదకి ఉసిగొల్పింది నక్క. సింహం గర్జిస్తూ ఒంటె దగ్గరకెళ్లింది. సింహాన్ని చూడగానే వినయంగా లేచి నిలబడింది ఒంటె. అంతెత్తు దాని ఆకారాన్ని చూసి సింహానికి కాస్త భయం కలిగింది. ఒంటె ఒక అడుగు ముందుకు వేసింది. సింహం బెదిరిపోతూ 'నన్ను చంపొద్దు! ఈ అడవికి రాజుగా నువ్వే ఉండు. నక్క మాటలు విని నీమీద దాడి చేద్దామని వచ్చాను' అంది సింహం.
ఒంటెకు విషయం ఏ మాత్రం అర్థం కాలేదు. 'రాజా! మీరేం మాట్లాడుతున్నారు? నేను సాధు జంతువును. పైగా శాకాహారిని. నేను మిమ్మల్ని చంపడమేంటి?' అంది ఒంటె.
ఒంటె మాటలతో సింహానికి ధైర్యం చిక్కింది. 'మిత్రమా! నక్క మాటలు నిజమని నమ్మాను. నీ ఆకారం కూడా నన్ను భయపెట్టిన మాట నిజం. నీకు అడవిలోకి అనుమతి ఇస్తున్నాను. నీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడే ఉండు' అంది సింహం స్నేహపూర్వకంగా.
ఇదంతా తెలియని నక్క 'ఆ ఒంటెని చంపేసి వచ్చారా మహారాజా!' అంటూ ఆనందంగా ప్రశ్నించింది. సింహం గట్టిగా గర్జిస్తూ 'ఓసీ.. జిత్తులమారి! నీ జిత్తులు ఇక నా దగ్గర సాగవు. ఇతర జంతువుల మీద చాడీలు చెప్పి అనవసరంగా చంపించావు. నిన్ను క్షమించేది లేదు. వెంటనే ఈ అడవిని వదిలి ఎడారిలో బతుకు' అంది సింహం. చేసేదిలేక నక్క ఎడారిపాలైంది. ఒంటెను మృగరాజు చేరదీసి మంత్రిగా నియమించుకున్నాడు.
Authorization