పక్షుల ప్రవర్తనను బట్టి పర్యావరణాన్ని అంచనా వేయగలమా?
ఒక ప్రదేశంలో ఉండే పక్షుల ప్రవర్తనను, కొన్ని నిర్ధిష్ట రుతువుల్లో వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షుల సంఖ్యను అనుసరించి పర్యావరణాన్ని అంచనా వేయవచ్చని అంటారు. అంటే, ఒక ప్రాంతంలో కాకులు, పిచ్చుకల సంఖ్య బాగా తగ్గిపోయినా లేదా, గతంలో కంటే వాటి చురుకుదనం, ఆటలు వంటివి చెప్పుకోదగినంతగా మందగించినా ఆ ప్రాంతం కచ్చితంగా కాలుష్య ప్రభావానికి గురయినట్టే. అడవులు లేదా చెట్ల నరికివేత, జలకాలుష్యం, వాయుకాలుష్యం వంటివన్నీ పక్షుల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గిపోవడానికి ప్రధానకారణాలవుతాయి. శబ్ద, వాయు కాలుష్యాలు ఎక్కువవుతుంటే ఆ ప్రాంతంలో చాలాకాలం నుంచి ఉన్న పక్షులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలసపోతుంటాయి. భూగోళంపై అతిశీతల ప్రాంతాలలో నివసించే పక్షులు చలికాలం వెచ్చగా ఉండే ప్రాంతాలకు వలసపోతాయి. మొత్తానికి పర్యావరణం ఎంతగా దెబ్బతింటున్నదీ తెలుసుకోవడానికి పక్షుల ప్రవర్తన, నివాస సమయాలు స్పష్టం చేస్తాయి.