హాయ్ నేస్తాలూ...! ఈ భూప్రపంచంలో ఒక్కో జీవి జీవితకాలం ఒక్కోలా ఉంటుంది. కొన్ని వంద సంవత్సరాలు జీవిస్తే.. మరికొన్ని పదుల సంవత్సరాలు, ఇంకా కొన్ని నెలలు, వారాలు, రోజులు ఇలా ఉంటుంది. మనకు ఇంతవరకే తెలుసు. కానీ మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం.. కొన్ని జీవులు వందల ఏండ్లు బతికితే మరికొన్ని వేల సంవత్సరాలూ జీవిస్తున్నాయి. నమ్మట్లేదా..ఇది చదవండి.
మెకావో
ఈ పక్షి చిలుక జాతికి చెందినదే. అయితే మామూలు చిలుక కంటే కాస్త పెద్దగా ఉంటుందన్నమాట. సిట్టాకేడ్ కుటుంబానికి చెందిన ఈ హయసింత్ మెకావోలు అరవై ఏండ్ల వరకూ బతుకుతాయి.
గ్రీన్‌ల్యాండ్ షార్క్
ఇవి విషపూరితమైనవి. ఈ చేపలుఎక్కువగా ఉత్తర ఆర్కిటిక్ ద్వీపంలో నివసిస్తాయి. దాదాపుగా గడ్డకట్టే వాతావరణంలో జీవించటం, జీవక్రియలు అతి తక్కువగా ఉండటంతో ఇవి 400 ఏండ్ల వరకూ బతుకుతాయి.
జెల్లీ చేప
మెడిటేరియన్ సముద్రంలో ఉంటే 'టుర్రిటోప్సిస్ దోర్హిని' అనే జెల్లీ చేపను 'చావును జయించిన జీవి'గా చెబుతారు. ఈ జీవి 4.5 మి.మీ. పొడవుతో ప్రౌఢ దశకు చేరిన తర్వాత తన జీవితాన్ని ముగించకుండా జువేలినైన్ పోల్ప్ అనే లార్వా దశకు చేరుకుంటుంది. అలా తన జీవితాన్ని మళ్లీ మొదలుపెడుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది.
ఎండోలిత్స్
ఎండోలిత్స్ అంటే శిలల ఉపరితలాలపై జీవించే బాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆల్గే లాంటివన్నమాట. ఈ సూక్ష్మజీవుల జీవిత కాలం 10,000 సంవత్సరాలు. ఎలాగంటారా? ఇవి స్వయంపోషితాలు. అంటే ఆక్సిజన్, సూర్యరశ్మి మొదలైన వాటి అవసరం లేకుండా అకర్బన పదార్థాలను వాడుకుంటూ తమను తాము పోషించుకోగలుగుతాయి. అందుకే ఇవి ఎక్కువకాలం బతుకుతాయి.
ది ఓషన్ కోహగ్
ఈ జీవులు ఏకంగా 500 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి బతికి ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా కష్టమట. కదులుతున్నట్లు కూడా కూడా అనిపించవు. ఇవి శరీరంలోని యాంటి ఆక్సిడెంట్లను సరైన మోతాదులో ఉంచుకుంటాయి. దానివల్ల కణజాలం తొందరగా పాడవదు. అందుకే ఈ జీవులు అన్ని సంవత్సరాలు బతకగల్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బోహెడ్ వేల్
ఈ తిమింగలం 200 ఏండ్లు బతుకుతుంది. కారణం ఇది చాలా తక్కువ శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే. అంతేకాదు దీని శరీరంలో పాడైన డీఎన్ఏను మెరుగుపరుచుకుంటూ, జీన్ మ్యుటేషన్నూ తట్టుకోగలుగుతుంది.
కేవ్సాలమాండర్
ఇది అచ్చంగా బల్లిని పోలి ఉండే శీతల జంతువు. ఈ కేవ్ సాలమాండర్ దాదాపు 100 సంవత్సరాలు బతుకుతుంది. పెరిగి పెద్దవటానికే దీనికి 15 ఏండ్లు పడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గుడ్లు పెడుతుంది.
Authorization