ఇదే తీపి గడ్డి. తియ్యగా ఉండటమే కాదు! మంచి వెనీలా వాసనొస్తుంది కూడా. శాస్త్రీయ నామం 'హైరోక్లో అడొరేటా'. వీటిలో 30 రకాలుంటాయి. అమెరికా, ఐరోపా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇదో ముఖ్య వనరు. అక్కడి ప్రవాహాలు, చెరువు గట్లు, కట్టల వెంబడి, చిత్తడి నేలల్లో పెరుగుతుంది. సంవత్సరానికి రెండు దిగుబడులనిచ్చే ఈ గడ్డి అక్కడి రైతులకు అధిక లాభాలనార్జించి పెడుతోంది. ఎలా అంటారా? తీపిగడ్డితో చాలా రకాల వస్తువులను తయారుచేస్తారు. పచ్చిగా ఉన్నప్పుడే జడలల్లేస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టి అలంకరణ వస్తువులు తయారు చేస్తారు. అంతేకాకుండా గడ్డిని కాల్చి పొడిచేస్తారు. అది ధూపంగా వేస్తే దాని వాసన గదంతా వ్యాపిస్తుంది. అలాగే ఈ గడ్డితో ఎన్నో రకాల బుట్టలు, ఫ్లవర్వాజులు, టోపీలు, బట్టలు నేస్తారు. ఇంకా స్ప్రేలు, సెంట్లు, కారు ఫ్రెష్నర్ల వంటి అగరబత్తీలు కూడా. గడ్డిపొడిని టీ పొడిలా కాచితాగుతారు. కొన్ని మందుల తయారీల్లోనూ వాడుతారు. ఈ వస్తువులన్నింటికీ స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది.