Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ / ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో 16 శాతం వృద్థితో రూ.7,703 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,638 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం 36,130.96 కోట్లుగా ఉండగా.. క్రితం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.38,438 కోట్లకు చేరింది. గడిచిన సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 1.08 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే కాలం నాటికి జీఎస్‌పీఏ 1.38 శాతంగా ఉంది. క్రితం క్యూ2లో మొండి బాకీల కోసం రూ.3,703.50 కోట్లు కేటాయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,700.68 కోట్ల కేటాయింపులు చేసింది. క్రితం క్యూ2 ముగింపు నాటికి బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు 14.9 శాతం పెరిగి రూ.10.89 లక్షల కోట్లకు చేరాయని ఆ బ్యాంక్ తెలిపింది. గతేడాది ఇదే కాలం నాటికి మొత్తం రుణాలు రూ.9.47 లక్షల కోట్లుగా ఉన్నాయి.
టాటా మోటార్స్ తో కలిసి..
టాటా మోటార్స్ పండగ సీజన్లో తమ వినియోగదారులకు సులభంగా రుణాలు లభించేలా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఇందులో భాగంగా తమ వాహనాలు కొనుగోలు చేసే వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1 లక్షలకు రూ.799 ఆకర్షణీయ వడ్డీతో రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని టాటా మోటార్స్ తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన వాహనాలపై 100 శాతం రుణం కూడా లభించనుందని తెలిపింది. రుణ కాలపరిమితి 5 ఏండ్లుగా ఉంటుందని పేర్కొంది. అన్ని ప్యాసింజర్ వాహనాల కొనుగోలుపై ఈ పథకం అమల్లో ఉంటుందని వెల్లడించింది.