- క్యూ3లో 0.4 శాతం పెరుగుదల న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో వండర్‌లా సానుకూల వృద్థిని నమోదు చేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో తీవ్ర పతనాన్ని చవి చూసిన జిడిపి గడిచిన క్యూ3లో స్వల్పంగా 0.4 శాతం పెరిగిందని శుక్రవారం కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఒ సవరించిన గణంకాల ప్రకారం.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా మైనస్ 24.4 శాతం, సెప్టెంబర్ త్రైమాసికంలో మైనస్ 7.3 శాతం క్షీణతను చవి చూసింది. ఇంతక్రితం ఈ గణంకాల పతనం వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి. 2011-12 స్థిర ధరల వద్ద గడిచిన క్యూ3లో జిడిపి రూ.36.22 లక్షల కోట్లకు చేరింది. 2019-20 ఇదే క్యూ3లో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లుగా ఉందని.. దీంతో పోల్చితే గడిచిన త్రైమాసికంలో వృద్థి 0.4 శాతంగా చోటు చేసుకుందని ఎన్‌ఎస్‌ఒ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జిడిపి మైనస్ 8 శాతానికి పడిపోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.స్తబ్దతలోనే కీలక రంగాలు జనవరిలో 0.1 శాతం పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగ కార్యకలాపాల్లో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఏడాది జనవరిలో ఎనిమిది కీలక రంగాలు కేవలం 0.1 శాతం పెరుగుదలను నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇంతక్రితం డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, విద్యుత్, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్, సిమెంట్ లాంటి ప్రాధాన్యత రంగాలు 0.2 శాతం వృద్థిని కనబర్చాయి. 2020 ఇదే జనవరిలో 2.2 శాతం పెరుగుదలను సాధించాయి. కాగా గడిచిన జనవరిలో ఈ కీలక రంగాలు అత్యంత స్వల్ప వృద్థితో సరిపెట్టుకున్నట్లయ్యింది. ఈ నేలలో ఎనిమిది సూచీల్లో ఐదు రంగాలు కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో కీలక రంగాల వాటా ఏకంగా 40.27 శాతంగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి కాలంలో ఈ ఎనిమిది ప్రాధాన్యత రంగాలు ఏకంగా మైనస్ 8.8 శాతం పతనమయ్యాయి. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా రెండంకెల్లో 10.1 శాతం క్షీణించాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 0.6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. గడిచిన మాసంలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, సిమెంట్ రంగాలు ప్రతికూల వృద్థిని చవి చూశాయి. కాగా.. ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు మాత్రం వరుసగా 2.7 శాతం, 2.6 శాతం, 5.1 శాతం చొప్పున పెరిగాయి.