Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ నవ మాసాలు మోసి, జన్మనిచ్చే అమ్మ గొప్పతనం గురించే మాట్లాడుతారు.. పుట్టిన బిడ్డకు పాల డబ్బాల నుంచి వారిని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకు వచ్చేందుకు తనలో తాను తపన పడుతూ శ్రమించే నాన్న గురించి చెప్పుకొనే వారు మన చట్టూ ఉన్న సమాజంలో చాలా అరుదే..బిడ్డలకు ఏ కష్టం రాకుండాదనే ధ్యేయంతో.. నిత్యం బయట ఎంత కష్టానైనా మోసే నాన్నలు ఎంతో మంది మన చుట్టునిత్యం కనిపిస్తుంటారు. ఎదైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మా..! అనే మనసు.. జీవితంలో పెద్దపెద్ద కష్టాలు వచ్చినపుడు మాత్రం నాన్న ఆసరానే కోరకుంటుంది. కష్ట సమయంలో నాన్న గుండెలపై ఒక్కసారి తల పెట్టి స్వేదదీరితే చాలు.. ఎంతో ఊరట లభిస్తుంది, దేవుడి సాయం లేకున్నా..దేవుడి లాంటి నాన్న నా దగ్గరున్నాడన్న నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఈ అనుభూతి మనలో చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా కలిగేదే.. ఇలా తాము జీవితంలో ఉన్నత స్థానాలకు చేరేందుకు ఎంతోగానో తొడ్పాటునందించిన నాన్నల గొప్పతనం గురించి 'అంతర్జాతీయ ఫాదర్స్ డే ' సందర్భంగా 'నవతెలంగాణ'తో పంచుకుంటున్నారు.'ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' అధ్యక్షుడు అనిల్ రెడ్డి వెన్నమ్, సీఐఐ తెలంగాణ ఛాప్టర్ ఛైర్పర్సన్ వనిత దాట్ల.
- నవతెలంగాణ, వాణిజ్య విభాగం
కష్టం విలువను తెలిపారు..
జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే కష్టాన్ని మించిన ప్రత్యామ్నాయ మార్గం మరోకటి లేదని నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూ వచ్చేవాడు. రాష్ట్రంలోనే ప్రముఖ వైద్యు లుగా పేరున్న డాక్టర్ కె.ఎస్.ఎన్. రాజు కుమార్తెగా సమాజంలో చిన్నప్పటి నుంచే మాకు ఒక మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. సమాజంలో ఆదర్శవంతంగా ఎదగాలని నాన్న నిత్యం చెబుతుండే వారు. వైద్యుడిగా ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న మాలో మంచి వ్యక్తిత్వం నింపేందుకు వీలుదొరికినప్పుడల్లా తపన పడేవారు. చిన్నప్పడు ఆయన చెప్పే మాటలకు అర్ధంగానీ.. విలువగానీ.. తెలియదు.. నాన్న చెప్పిన మాట వినాలి అంత వరకే తెలుసు. కానీ ఇప్పుడు ఒక స్థాయి వచ్చాక ఆ మాటలలోని పరమార్థం తెలిసివస్తోంది. ఇప్పటికీ 76 ఏళ్ల వయస్సులో కూడా రోగులకు మెరుగైన చికిత్స అందించడం, సమాజిక సేవ కోసం జీవిస్తున్న తీరు ఆదర్శప్రాయంగా అనిపిస్తుంది. తనపై తాను విధించుకొనే నియంత్రణ, కష్టపడే తత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇవే లక్షణాలను నాన్న మాకుచిన్నప్పటి నుంచి నేర్పించారు. యువతగా ఉన్న మేము ఇప్పటికి నాన్నతో పోటీపడి పని చేయలేకపోతున్నాం. నాన్న నింపిన విశ్వాసం, ఆయన చూపిన బాటతోనే జీవితంలో రాణించగలుగుతున్నాం. నాన్నా నీకు హ్యాట్సాఫ్్. నాన్నలందరికీ శుభాకాంక్షలు.
- వనిత దాట్ల.
అన్నదాత స్థాయి నుంచే ఆదర్శంగా..
కరీంనగర్ జిల్లా వెములవాడ మండలంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను రైతుగానే చూశాను. పోలంలో నాన్న నిత్యం పడే కష్ట చేసే వారు. చేపట్టిన ఏ పనినైనా ఏకాగ్రతతో పూర్తి చేయడం ఆయన నైజం. అదే సుగుణాన్ని నాన్న పిల్లలకు నేర్పారు చదువులోనూ, వ్యాపారంలోనూ ఇదే సూత్రం పాటించాలని ఆయన సూచించే వారు.దానిని పాటించడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానాలకు చేరగలిగాం. అనివార్య కారణాల వల్ల ఊరు విడిచి హైదరాబాద్ బాట పట్టాల్సి వచ్చినపుడు కూడా నాన్న ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. కుటుంబం కొంత ఆందోళనకు గురైనా తాను మాత్రం ధైర్యం కోల్పోకుండా ఇక్కడ స్థిరపడ్డారు. ఇందుకోసం నాన్న కృష్ణారెడ్డి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. అయితే వాటి ప్రభావం మాత్రం పిల్లలమైన మాపై పడకుండా చూసుకునే వారు. ఎంత కష్టానైనా దిగమింగుతూ.. ధైర్యంగా ముందుకు సాగేవారు. చిన్ననాటి నుంచి కష్టజీవిగా ఉన్న నాన్న మమ్మల్ని పెద్ద చేసేందుకు నిత్యం ఎంతో శ్రమించేవారు. పిల్లలం బాగా స్థిరపడ్డప్పటికీ ప్రస్తుత 87 ఏళ్ల వయస్సలో సైతం సమాజానికి ఎదో చేయాలన్న తప్పన నాన్న సొంతం. అప్పుడప్పుడు పని వొత్తిడితో విసిగిపోయినప్పడు నాన్నను చూస్తే చాలు ఒక్కసారి ఎంతో కొత్త ఉత్సాహం పుట్టుకువస్తుంది. ఆయన పడ్డ కష్టం ముందు మనం పడే కష్టం ఎంత అనే భావన కలుగుతుంది. నాన్న నేర్పిన నాయకత్వ లక్షణాలే ఉన్నత స్థాయిలో నిలిపాయని గర్వంగా చెబుతున్నా. నాన్నా నీకు పాదాభివందనం. 'ఫాదర్స్ డే' సందర్భంగా నాన్నలందరికీ శుభాకాంక్షలు.
- అనిల్ రెడ్డి వెన్నమ్