Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.10వేల కోట్లను దాటనున్న సమీకరణ
- అయిదేళ్ల గరిష్ఠానికి నిధుల వేట
- ఇప్పటికే 'క్యూ' కట్టిన 19 కంపెనీలు
- ఐపీఓపై మరిన్ని సంస్థల దృష్టి
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
మార్కెట్లలో పరిస్థితులు అనుకూలంగా మారుతుండడంతో కంపెనీలు పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) ద్వారా నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్, కాఫీడే వంటి పెద్దపెద్ద సంస్థలతో పాటుగా పలు చిన్నచిన్న సంస్థలు కూడా ఐపీఓపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగానే మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి వరుసగా 'డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్' (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేస్తుండడం మార్కెట్లకు నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుత 2015 ఏడాదిలో పబ్లిక్ ఇష్యూల ద్వారా జరుగుతున్న నిధుల సమీకరణను చూస్తే.. అది గత అయిదేళ్ల గరిష్ఠానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.10,000 కోట్ల మార్కును దాటేందుకు అకవాశం ఉందని వారంటున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో గడిచిన ఆరు నెలల కాలంలో మొత్తం ఎనిమిది కంపెనీలు సంయుక్తంగా దాదాపు రూ.3850 కోట్ల మేర నిధులను సమీకరించాయి. గత ఏడాది మొత్తంలో ఐపీఓకు వచ్చిన అయిదు కంపెనీలు సమీకరించిన రూ.1,201 కోట్ల కంటే ఇది రెండింతల కన్నా ఎక్కువ.
మార్కెట్ పరుగే ప్రోత్సాహకం..
కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ సెల్యూలార్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు దాదాపు రూ.2,750 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద డీఆర్హెచ్పీలను దాఖలు చేశాయి. ఈ మూడు కంపెనీలతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 19 కంపెనీలు ఐపీవోకు కాను డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేశాయి. వీటి మొత్తం సమీకరణ రూ.11,000 కోట్లుకు పైమాట గానే ఉండనుంది. టీమ్‌లీజ్, ఇన్ఫీబీమ్, జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ వంటి సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించాలని యోచిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా మార్కెట్ల పని తీరు, పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా చాలా కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తూ వచ్చాయి. ఇప్పుడు కొంత అనుకూల పరిస్థితులు నెలకొనడం, ప్రభుత్వాలు ప్రోత్సాహక చర్యలను ప్రకటించడంతో కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలతో మళ్లీ ముందుకు వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఐపీఓకు మంచి స్పందన రావడానికి, కొత్త కంపెనీలు 'క్యూ' కట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.