Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఆయన సంపద తాజాగా 150 బిలియన్ డాలర్లను దాటడంతో ఆయన 'ఆధునిక ప్రపంచపు అపర కుబేరుడి'గా రికార్డు నెలకొల్పారు. ప్రముఖ ర్యాంకింగ్ సంస్థ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం బెజోస్ సంపద సోమవారం నాటికి 150 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. గత వారం రోజులుగా అమెజాన్ షేర్లు 0.5 శాతం మేర ఎగిసినట్లు తద్వారా ఆయన సంపద పెరిగినట్టుగా బ్లూమ్బర్గ్ పేర్కొంది. ప్రపంచ కుబేరునిగా అవతరించిన తర్వాత అమెజాన్ షేర్లు ఇంతలా పుంజుకోవడం ఇదే తొలిసారి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభించిన రోజే బెజోస్ ఈ అరుదైన మైలురాయి అందుకోవడం గమనార్హం. ఇక బెజోస్ తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 95.3 బిలియన్ డాలర్లతో రెండోస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న బిల్గేట్స్ కంటే బెజోస్ సంపద సుమారు 55 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 1982లో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను ప్రారంభించిన నాటి నుంచి బెజోస్ మాదిరిగా ఇంత మొత్తంలో సంపదను నమోదు చేసిన ఏకైక వ్యక్తిగా బెజోస్ కొత్త చరిత్రను లిఖించారు. బెజోస్ కంటే ముందు బిల్గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉండేవారు. 1999లోనే ఆయన సంపద 100 బిలియన్ డాలర్లను తాకింది. అయితే బిల్గేట్స్ తన సంపదలో చాలా భాగం 'బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్'కు విరాళంగా ఇచ్చేశారు. దీంతో ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. లేదంటే నేటికి ఆయన సంపద కూడా 150 బిలియన్ డాలర్లను దాటి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. గేట్స్ తరువాత స్థానాల్లో వారన్ బఫెట్(83 బిలియన్ డాలర్లు), జుకర్బర్గ్(83 బిలియన్ డాలర్లు), అమాన్సియో ఒర్టెగా(75 బిలియన్ డాలర్ల)లు అత్యధిక సంపద కలిగిన వారిగా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.