Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాత్వే, డెన్, డేటా కామ్‌లతో కీలక చర్చలు
- దాదాపు చివరి దశకు చేరిన సంప్రదింపులు
- రెండు సంస్థల బోర్డుల కీలక సమావేశం నేడు
- అధికారికంగా వివరాలు వెలువడే అవకాశం!
- జియో బ్రాండ్‌బ్యాండ్ విస్తరణే లక్ష్యంగా ప్లాన్
- దేశంలోని చిన్న ఆపరేటర్లలో పెద్ద గుబులు
న్యూఢిల్లీ: 'జియో' పేరుతో టెలికాం సేవలను ఆవిష్కరించి.. ఆ రంగంలో పెను సంచలనానికి తెర లేపిని రిలయన్స్ సంస్థ.. తాజాగా దేశీయ కేబుల్ రంగంపై దృష్టి సారించింది. త్వరలో ఫైబర్ నెట్వర్క్ ద్వారా జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్న రిలయన్స్.. దేశంలో అతిపెద్ద టీవీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా హాత్వే కేబుల్, డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలలో కీలక వాటా కొనుగోలుకు రిలయన్స్ సంస్థ చర్చలను ప్రారంభించింది. రిలయన్స్ సంస్థ తన అనుబంధ కంపెనీల ద్వారా ఆయా సంస్థల్లో వాటాను కొనుగోలు చేసేందుకు దూకుడుగా విస్తృత చర్చలు జరుపుతోంది. తాజా సమాచారం మేరకు ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో నేడు (బుధవారం) ఈ డీల్‌కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం గురించి హాత్వే కేబుల్, డెన్ నెట్వర్క్ సంస్థలు మార్కెట్లకు సమాచారం ఇస్తూ.. రిలయన్స్‌కు వాటా విక్రయించే విషయమై చర్చించేందుకు గాను తమతమ సంస్థల బోర్డులు బుధవారం (17న) సమావేశం కానున్నట్టుగా ప్రకటించాయి. ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ విషయమై నిర్ణయం తీసుకొనేందుకు గాను బోర్డులు బుధవారం సమావేశం కానున్నాయని ఇరు సంస్థలు తెలిపాయి. అయితే ఈ పరిణామం గురించి వివరాలను వెంటనే వెల్లడించేందుకు గాను రిలయన్స్, డెన్, హాత్వే సంస్థలు నిరాకరించాయి. జియో గొడుగు కింద ఆప్టికల్ ఫైబర్ ద్వారా హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్న రిలయన్స్ సంస్థ మార్కెట్లో ఇప్పటికే విస్తరించి ఉన్న హాత్వే, డెన్ నెట్‌వర్క్‌లలో వాటా కొనుగోలుతో ఈ విపణిలోకి సులువుగా ఎంట్రీ తీసుకోవడంతో పాటు.. వ్యాప్తిని వేగంగా చేపట్టొచ్చని భావిస్తోంది. హాత్వే సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 16 నగరాలలో కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ విస్తృతిని కలిగి ఉంది. నాలుగు మెట్రో నగరాలతో పాటుగా మూడు మిని మెట్రోలులో దాదాపు 35000 కి.మీ. ఫైబర్ కేబుల్ నెట్వర్క్ కూడా హాత్వే సొంతం. కంపెనీకి ఇప్పటికే దాదాపు 8,00,000 మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. మరోవైపు డెన్ కేబుల్ సంస్థ మొదటి దశలో 15 నగరాలలో తమ కేబుల్, బ్రాడ్ బ్యాండ్ సేవలను కలిగి ఉంది. వీటిని రానున్న రెండు మూడేండ్లలో 500 నగరాలకు విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
చితికిపోనున్న చిన్న ఆపరేటర్లు...
బాడా కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోనున్నాయన్న వార్తలు చిన్న కేబుల్ ఆపరేటర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానికతను దృష్టిలో ఉంచుకొని తాము కేబుల్ వ్యాపారాన్ని విస్తరించుకొని జీవనం సాగిస్తున్నామని.. ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ కేబుల్ రంగంపై దృష్టి సారించి.. తమ పొట్టకొట్టాలని భావిస్తుండడం సబబు కాదని వారంటున్నారు. దేశంలో డిజిటల్ వ్యాప్తి పేరుతో సర్కారు కార్పొరేట్ సంస్థలతో జట్టుకట్టి.. కేబుల్ రంగంలో ఉపాధి పొందుతున్న వారికి ఉసురు పోసుకోవడం సరికాదని ఈ రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియో రాక ద్వారా టెలికాం రంగ మార్కెట్లో విధ్వంసం నమోదు అయిందని.. రానున్న రోజుల్లో ఇదే తరహా విధ్వంసం దేశీయ కేబుల్, డేటా నెట్వర్క్ రంగాలలో కూడా ప్రతిబింబించే అవకాశం ఉందని వారు తీవ్ర ఆందోళనను వ్యకం చేస్తున్నారు.