Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బజాబ్ నుంచి 'క్యూట్' విడుదల
- లీటరుకు 36 కి.మీ. మైలేజీ
- ధర 2.64 లక్షలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ బజాజ్ ఆటో తాజాగా బుల్లి కార్ల విభాగంలోనూ తన సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది. సంస్థ తొలిసారిగా 'క్యూట్' పేరుతో బుల్లి కారును మార్కెట్లోకి తేనుంది. రేపటి (18వ తేదీ) నుంచి అధికారికంగా ఈ బుల్లి కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. భారత్‌లోనే తొలి క్వాడ్రిసైకిల్ ఇదేనని బజాజ్ ఆటో తెలిపింది. అంటే ఈ బుల్లికారు డిజైన్, వినియోగం పరంగా ఆటో, కారుకు మధ్యస్తంగా ఉండనుంది. ఈ వాహనాలను అటు కమర్షియల్ గానూ.. ఇటు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు. బజాజ్ క్యూట్‌కు తొలిసారిగా 2012 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేశారు. ఆ తర్వాత 2016 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించారు. 216 సీసీ సామర్థ్యం, సింగిల్ సిలిండర్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ తదితర ఫీచర్లతో బజాజ్ దీన్ని తయారు చేసింది. పెట్రోల్ వెర్షన్, సీఎన్జీ వెర్షన్లోను దీనిని వాడుకోవచ్చు. పెట్రోల్ వెర్షన్లో ఈ కారు 13 బీహెచ్పీ పవర్, 18.9ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వెర్షన్లో 10 బీహెచ్పీ పవర్, 16ఎన్ఎం టార్క్‌ను క్యూట్ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కారును తీసుకొస్తున్నట్లు గతంలో బజాజ్ వెల్లడించింది. అందుకే అందుబాటు ధరల్లో విడుదల చేయనుంది. పెట్రోల్ వెర్షన్ క్యూట్ ధరను సంస్థ రూ.2.64 లక్షలు, సీఎన్జీ వెర్షన్ ధర రూ. 2.84 లక్షలుగా (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. 'క్యూట్' లీటరుకు 36 కి.మీ. మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.