Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ మరోమారు తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. బెజోస్ సంపద 125 బిలియన్ డాలర్లుగా నిలిచింది. అమెజాన్ అధినేత తన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకుల సందర్భంగా భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ.. ఆయన ఆస్తులు125 బిలియన్ డాలర్లగా నిలవడం విశేషం. ఈ సూచీలో గత కొంతకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోన్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. తాజా సూచీలో మూడో స్థానానికి పడిపోయారు. గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్ట్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లుగా నిలిచింది. గేట్స్ ఆస్తుల మొత్తం విలువ 107 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇటీవలే బిల్‌గేట్స్ తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంపద 107 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆర్నాల్ట్ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్ డాలర్లు సంపాదించారు. బెజోస్ నుంచి విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లుగా నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో ఆయనకు 13వ స్థానం లభించింది.