Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదికి 7.0 శాతానికే పరిమితం..
- 2020-21లో 7.2% వృద్ధికి ఆస్కారం
- రెండేండ్ల తరువాతే మళ్లీ పుంజుకోవచ్చు
- ప్రపంచ ఆర్థికానిది ఆదే దారి:ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మందగిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత వృద్ధి అంచనాలకు కొత పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా భారత్ వృద్ధి అంచనాలను తగ్గించింది. భారత డిమాండ్‌లో నెలకొన్న మందగమనం కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 0.3 శాతం తగ్గి 7.0 శాతానికే పరిమితం కావొచ్చునని పేర్కొంది. ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించిన ప్రతిష్టాత్మకమైన 'వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్'లో ఈ సంగతిని పేర్కొంది. వచ్చే ఏడాదికి కూడా ఇదే తరహా కోత కనిపించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా కట్టింది. ఫలితంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.2 శాతానికే పరిమితం కావొచ్చునని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇది ఐఎంఎఫ్ గతంలో అంచనా కట్టిన దానికంటే కూడా 0.3 శాతం తక్కువ కావడం విశేషం. భారత్ వృద్ధిరేటులో గత వైభవాన్ని అందుకోవాలంటే మరో రెండేండ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 తరువాత 7.2 శాతం వృద్ధిని అందుకోవచ్చని.. అప్పుడే.. 2017-18లో మాదిరిగా భారత ఆర్థిక వ్యవస్థ వ్యాప్తి చెందేందుకు ఆవకాశం ఉందని ఐఎంఎఫ్ తన నివేదిక విశ్లేషించింది.
కీలక రంగాలలో మందగమనం..
భారత్‌లో వాహన రంగంతో సహా కీలక రంగాలలో మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ తన నివేదికలో తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించిన సమాచారం మేరకు గత జూన్ మాసంలో వాహనాల రిటైల్ అమ్మకాలు 1.64 మిలియన్ యూనిట్ల మేర (5.4 శాతం) పడిపోయిన అంశాన్ని నివేదిక ఉదహరించింది. ఏడు శాతం వృద్ధి రేటు ఆర్థిక శాఖ అంచనాలకు దరిదాపుల్లోనే ఉండడం విశేషం. ఐఎంఎఫ్ జీడీపీ అంచనాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ విస్తృతి బలంగా ఉండదనే సంకేతాలు అందాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ వృద్ధి పడిపోనుంది..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా రానున్న రెండేండ్ల కాలంలో 0.1 శాతం మేర కుంగి వరుసగా 3.2 శాతం, 3.5 శాతం మేర మాత్రమే వృద్ధి చెందే అవకాశం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపింది. వీటిపై బ్రెగ్జిట్, గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు వంటి అనిశ్చిత పరిస్థితులు మరింతగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నివేదిక తెలిపింది. భారత్‌తో పాటు చైనా వృద్ధి విషయంలోనూ ఐఎంఎఫ్ తన అంచనాలకు కోత పెట్టింది. చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.0 శాతం మేర మాత్రమే వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. అంతకు ముందు ఐఎంఎఫ్ అంచనా కట్టిన దానికంటే ఇది 0.1 శాతం తక్కువ కావడం విశేషం.