Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అమెరికన్లకు భారతీయ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం మేరకు భారత ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకు దాదాపు లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించినట్టుగా తెలుస్తోంది. నాలుగు ప్రధాన భారత ఐటీ కంపెనీలే దాదాపు 55,000 ఉద్యోగాలను అమెరికన్లకు అందించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలు దీనికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి చూస్తే భారత ఐటీ కంపెనీలు ఈ స్థాయిలో అమెరికన్లకు కొలువులు కల్పించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
తమ వ్యాపారాన్ని మరింత గ్లోబలైజ్ చేయడంతో పాటు వీసాకు సమస్యలను అధిగమించే ఉద్దేశంతోనే భారత కంపెనీలు అత్యధికంగా అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత్లో మూలాలు కలిగి ఉండి అమెరికాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న కాగ్నిజెంట్ సంస్థ అత్యధికంగా దాదాపు 46,400 మంది అమెరికన్లకు కొలువులను కల్పించింది. భారత ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న అమెరికన్లకు సంబంధించిన సమాచారంతో ఐటీబాడీ నాస్కామ్ ఒక నివేదికను వెల్లడించింది.
దీని ప్రకారం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ -20,000, ఇన్ఫోసిస్- 14,000, హెచ్సీఎల్-13,400, విప్రో-10,000 మంది అమెరికన్లకు కొలువులు కల్పించింది. అమెరికాలోని ఆయా కంపెనీలకు చెందిన సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది స్థానికులే ఉంటున్నట్టుగా నివేదిక తెలిపింది.