Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా : ట్రంప్ ఉన్మాదపూరిత వ్యాఖ్యలను ఫేస్బుక్ నుంచి తొలగించాలని ఆ సంస్థ సిబ్బంది వాకౌట్ చేసినా ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ట్రంప్ పోస్ట్ చేసిన వ్యాఖ్యలను తొలగించకూడదన్న వైఖరికే తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని జుకర్‌బర్గ్ తెగేసి చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన పోస్ట్‌ను అనుమతించడం కంపెనీ నైతికతను పాతరేయడమేనంటూ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ సమీక్షా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మే 25న జార్జిఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా అంతటా నిరసనలు భగ్గుమన్న తరుణంలో 'లూటీలకు తూటాలే బదులిస్తాయని (వెన్ లూటింగ్ స్టార్ట్, షూటింగ్ స్టార్ట్) అని ట్రంప్ ట్వీట్ చేశారు. నిరసనకారులపై హింసను ప్రేరేపించే ట్రంప్ వ్యాఖ్యలను ట్విటర్ తన ఖాతా నుంచి తొలగించినా, ఫేస్ బుక్ మాత్రం అనుమతించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంలో తప్పకచర్యలు తీసుకుంటామన్న జుకర్‌బర్గ్ దానికి భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే, జుకర్‌బర్గ్ వైఖరి నచ్చనివారు సంస్థ నుంచి బయటకు పోవచ్చు అని ఫేస్బుక్ ప్రతినిధి అన్నారు. ఫేస్ బుక్ ఉద్యోగి ఒకరు జుకర్‌బర్గ్ వైఖరిని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆల్హ్యాండ్ మీటింగ్‌లోనూ తన వ్యతిరేకతను వ్యక్తం చేరారు. సియాటెల్‌లోని ఫేస్బుక్ యూనిట్లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న బ్రాండన్ డైల్ ట్విట్టర్లో రాసి పెట్టిన పోస్ట్‌లో'నాయకత్వం మాతో లేదని చాలా స్పష్టంగా వెల్లడైంది' అని పేర్కొన్నారు. జుకర్ బర్గ్ శుక్రవారం నాడు ట్రంప్‌తో మాట్లాడినట్టు ఆక్సియస్ వెబ్సైట్ తొలుత వెల్లడించింది.