Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓడలు బండ్లూ
బండ్లు ఓడలయినట్టు
గుండెలు గోడలూ
గోడలు గుండెలవుతున్నరు
ఎన్నెన్ని గోడలు
ఎన్నెన్ని గోడులు
ఇంటి గోడలు
బడి గోడలు
గుడి గోడలు
జైలు గోడలు
బయలు గోడలు
బంగరు బయలు గోడలు
ఆస్పత్రి గోడలు
నీటి తోవ గోడలు
నూతి గోడలు
బతుకు గోడలు
మొండి గోడలు
అన్నీ అన్నీ గోడలే
నిండా గోడులే
ప్రతి గోడూ ఆలకించి
తమ గొంతు సవరించీ...
చిత్రం.. గోడలకూ
మొలిచాయి గుండెలు
ద్రవించే హృదయాలు
తపిస్తున్నాయి
శపిస్తున్నాయి
ఘోషిస్తున్నాయి
మా దగ్గర హద్దులున్నాయి
పద్దులున్నాయి
జమా ఖర్చులున్నాయి
చక్కని చదువులూ
చిక్కని సర్టిఫికెట్లు
మూల్గుతున్నరు
పెట్టెలల్ల
ఊపిరి బిగబెట్టిన
శ్రమైక జీవనం
ఎన్నాళ్లీ దారీ తెన్నూ లేని
జీవితాలని నిలదీస్తున్నాయి
విని వినీ
'అమ్మ'ల ఘోష
గోడలన్నీ 'అమ్మ'తో జత కలిసాయి
ఏ క్షణానో భళ్లున బద్దలై
సర్రున చక్రాలై
రివ్వున దూసుకొస్తారు
ఖబడ్దార్...
- జి.రాజకుమారి