Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానలో తడిసి మొలకెత్తిన వాళ్ళము
వానంటే మాకు
పారుతున్న నీళ్ళవెంబడి ఉరికే
కాగితప్పడవల జ్ఞాపకం గాదు
మట్టిమిద్దె కురుస్తుంటే
గూనపెంకు మూయడానికి పోతూ
నెత్తిన గోనెసంచి కప్పుకున్న జ్ఞాపకం
వానలో నడిచి గాయపడ్డ వాళ్ళము
వానంటే మాకు
వేడివేడి బజ్జీలు, ఉల్లిగడ్డ ముక్కలు
పొగలు కక్కుతున్న 'టీ' గాదు
జివాలను కాయడానికి పోతే
మధ్యలోనే వాన దొరికిచ్చుకున్నప్పుడు
మేకపిల్లల్లాగే ఒణుకుతూ
చెట్టుదాపున నిలబడ్డ పచ్చి జ్ఞాపకం
అరచేతులను సాచి
సుతారంగా నడిచే
తన్మయత్వమూ గాదు
ఎక్కడో చెట్లకింద కట్టేసిన ఎడ్లమీద
పిడుగుదొంగ మెరుపుదాడి చేసినపుడు
కిందమీద పడుతున్న వానలో నిలబడి
నిలువునా కాలిపోయిన
కమరు వాసన జ్ఞాపకం
జలపాతపు అంచున నిలబడి
తీసుకునే సెల్ఫీ అనుకుంటున్నారా వానంటే ?
వరదనీళ్ళల్ల చేనంతా మునిగిపోతే
కండ్లు తేలేసిన పంటతండ్రి జ్ఞాపకం
మీరనుకున్నట్లు వానంటే మాకు
ఆకుచాటు పిందెతడిసే పాట గాదు
మైకుల ముందు
సర్కారుపాడిన విరాళ పాటలు
నీళ్ళలోనే కొట్టుకుపోతే
మల్లమల్ల మా తలపండును పగులగొట్టుకోవడం
- తగుళ్ళగోపాల్,
9505056316