Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ దేశభక్తుడా ..!
ఏ మార్కెట్ ముందైనా
నవ్వుతున్న రైతుల్ని చూశావా
పుట్టెడు గింజలమ్మి
పయిమీదికి
పంచె కొనలేని దుస్తితిలో ....
ఏ చినుకులు
మొలకెత్తడానికి కురువలె
ఏ కార్తులు
సేద్యానికీ ఆసర కాలె
ఏ పండుగలు
పులుగం వండలె
ఎన్నడు చెంబెడు పాలు పొంగలె
అన్నీ కాలాలు ఉరి కాలాలే
ఒక్కేడు గడెం కడ్తే
నాలుగేండ్లు దేశాలే...
తలుగు తెగిన కాడెద్దులు
మేడితోకలిరిగిన నాగళ్ళు
సెలుకల సేతానమెట్ల
బతుకు పొద్దెక్కేదెట్ల
ఏ దిక్కు మొక్కినా
మబ్బులు కదులవు
ఏ పుట్టకు పాలుపోసినా
నాగులు తలుపులు తెరువవు
ఏ చెట్టుకింద ఆగినా చెమటలు కక్కుతున్నవి
తెల్లారుతే అప్పులు గుండెపోటు
పదివేల రుణాలకు ముప్పుతిప్పలు
తిప్పిసంపే నయవంచక విధానాలు
పెట్టుబడిదారుల వెన్నెముకలుగా జాతీయ బ్యాంకులు
అపరకుభేరులకు అత్యవసర ప్యాకేజీలు
పేరుకే ప్రజా ట్యాగులైన్లు
గాట్ల గుంజల్లా
దూడపెయ్యలు తల్లి ఆవుకెదిరిచూసినట్లు
బీడు దుక్కుల కరువు గోసలు
అత్తెసరు సాయాలకు
అరమైలు చెప్పుల వరుసలు
ఏ నూతన విధానం ఆకలి చావులనాపలె
కల్తీవిత్తనాలు ఎరువులు
మద్దతు ధరలు లేని భారత్ వెలుగులు
ఒకేచెట్టు, ఒకేతీగ,ఒకేపండు
కార్పొరేట్ కంపెనీలు
శాసిస్తున్న శాసనాలు నేటి కత్తుల కడగండ్లు
మూపురం మీద పుండును పోడుస్తున్న
కొత్త కొత్త కాకులు
ముల్లుకర్రల కంట్లో కన్నీళ్లు
మార్కెట్ కాంటాల తక్కేట్లో వెన్నెలవెలుగులు
మీ భుజాల నొప్పులకు
రాజ్యాంగం ఎన్నిసార్లు సవరణలో
వరి కంకులెన్ని రాలిపోయినా
పార్లమెంట్ లు గడ్డకట్టుకునే ఉంటయి
గింజలకోసం ఏ ఆర్డినెన్స్ పుట్టదు
పెరట్లో పువ్వులకై అర్దరాత్రే ప్రణాళికలు
మాకెవరు గోచిపెడ్తలేరు
మా వెనుక దేశభక్తులెవరు లేరు
కంకి కల్లం కడుపు మండి
పోరుబాట పట్టినం
చేను చెలుక దండుగట్టి
సాగు పోరై సాగినం
ఊరు ఏరు ఒక్కటై
డిల్లీ మైదానం చేరినం
మేమో...మీరో.. తేలాలి
(రైతులకు మద్దతుగా..)
- వనపట్ల సుబ్బయ్య
9492765358