Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనాదిగా జరుగుతున్న దగా కాదా ఇది!
సింధు నాగరికత అయితేనేం,
హిందు నాగరికత అయితేనేం,
నాగటి చాళ్ల వెంట
విత్తనమై నాటుకొని
మొలకెత్తి, గంపెత్తే నాటికి
గద్దల్లా తన్నుకెళ్లే
దగా సూత్రాలు మారిందెప్పుడు
గాదెల్లో ధాన్యాలు నిండిందెప్పుడు
బళ్ళల్లో తరిలిపోయే బస్తాలు
రైలు బళ్ళల్లో తరలిపోతున్నారు!
రేపు డ్రోన్లో, హెలికాప్టర్లో
పొలాల్లో వాలతారు!
నీ గింజల మీదే వాడు
ఎవరు తినాలో రాస్తున్నాడు.
నేల నొదిలిపెట్టి బతకలేని
నీ బలహీనత వాడికి పెట్టుబడైపోయింది.
గింజ మీద వదలని నీ వ్యామోహం
వాడికి వ్యాపారమైంది.
ఢిల్లీ చల్లో వణుకుతూ కూడా
నీతిమాలిన చట్టాలొద్దంటున్నావు తప్ప
నాగలి పట్టనని భీష్మించడంలేదు..
నీ బతుకు మీద వాడు దెబ్బ కొడుతున్నా
వాడికి మెతుకు పెడతాననే అంటున్నావ్.
నేలమీద నీ తీరని మమత
ఈ నేలన శ్వాసించే ప్రతి ఒక్కడి భవిత.
మనుగడని శాసించే మానవత.
కోల్పోకు నీ బంధాల్ని,
ప్రశ్నించు నిర్బంధాల్ని!
నిన్నా, నేడూ, రేపూ, నేలా నీదే!
ఎప్పుడు పోతాడో తెలీనివాడు వాడే!
ఓరిమి నీ కవచం. పోరు నీ విజయం .
- వి.విజయకుమార్,
8555802596