Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసిన గడియకు
తేసే గడియకు మధ్య ఒక దినం గడిచిపోయింది
ఉషోదయాలు నా కంటికి ఆనకపోయినా
కొన్ని సూర్యస్తమయాలను మాత్రం చూడగలిగినా
ఎన్నో సంఘర్షణల మీంచి
ఎన్నో సంభాషణల మీంచి
ఎన్నో సంక్షోభాల మీంచి
ఎన్నో సందళ్ళ మీంచి
ఎన్నో భయాల మీంచి
ఎన్నో పాడు ఆలోచనల ఉదయాల మీంచి
దినం గడిచిపోయింది
తడిచేతుల గ్లిజరిన్ సబ్బుబిళ్లా అలా జారిన చందంగా
ఈ దినం గడిచిపోయింది
అనుకున్న పనులు అవ్వకపోయినా
ఆలోచించిన పనులు వాయిదాపడినా
అనుకోని కొన్ని పనులు అలవోకగా జరిగిపోయినా
ఊహించని సంఘటనలు ఉనికిచాటినా
వేకువ నుండి వెన్నెల తొలగిన విధంగా
ఒక దినం గడిచిపోయింది
ఈ దినం నడిచిపోయింది
దినాలు గడిచిపోతున్నాయి
సుదినాలు గడిచిపోతున్నాయి
ఐనా గాని
ఎప్పట్లాగే చిరుస్వప్నాల ముంగిట నేను
ఎప్పట్లాగే కొన్ని శోకనయనాల ముంగిట నేను
ఎప్పట్లాగే కొన్ని అవ్యక్తభావాల కండ్ల ముంగిట నేను
ఎప్పట్లాగే రేపటి వేకువ ఇండ్ల ముంగిట నేను
ఎప్పట్లాగే పెదవాగు గలగలల ఎదసవ్వడ్ల ముంగిట నేను
కొండంతాఆశగా రేపటి నవోదయానికై ఈ చిరుచీకటుల అలజడ్ల ముంగిట నేను వేచివున్నాను....
- రమేష్ నల్లగొండ, 8309452179