Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్యాల నెత్తికెత్తుకుని,
ప్రజల కష్టాలను పుక్కిటబట్టి
మనసు గాయాలకు
పసరు ఔషధాన్ని పూసిన
పల్లెటూరి నార్మన్ బెథూన్ చేతనతడు.!
కోలాటాన్ని కొలిమినిజేసి
'నాగులో' అంటూ కొచ్చటి నిప్పురవ్వల
రాజేస్తున్నప్పుడు నాలుగు పడగలను
నలిపివేసే ఎర్ర మైఖేల్ జాక్సన్ స్టెప్పులతడు.!
మంత్రాలు చేతబడి బూచీతో
మనిషిని అంతం చేసేటోళ్ళనడ్డుకుని,
నాకు చేయమని సవాలిసిరి
సత్యబోధన చేసిన సోక్రటీస్ శిష్యుడతడు.!
బడికోసం తండ్లాడి
వెన్నెముకను ఎన్నుగర్ర చేసి,
పక్కటెముకల వాసాలపై
తరగతి గది నిర్మించినపుడు
పిల్లల కళ్ళలో పూసిన పూలే అతడు.!
మోటగొట్టే జీతగాడి నుంచి
మొత్తం పల్లెను నడిపే నాయకుడై,
పటేళ్ళకే పెద్దమనిషై
పంచాయితీలు పరిష్కారం చేసినపుడు
అంబేడ్కరుడి ఆత్మగౌరవ స్పూర్తి అతడు.!
మాటలకు చేతలకు తేడాలేని
ఏకరూప చర్యలతో
ఊళ్ళనింటిని ఊపుతో
ఒక్కతాటిపై నడిపినపుడు
నా కలల రివల్యూషనరీ
చేగువేరా సోపతి అతడు.!
సంపాదన కన్నా చదువు మిన్న,
సౌకర్యాలకన్న సాటివారి కోసం
కొల్పోవడమే బతుకని
జీవితపాఠం చెప్పినపుడు
మండేలా గుండె గొంతుకతడు.!
ప్రశ్న జవాబులతో
కార్యాకారణ సంబంధాలను అన్వేషిస్తూ
మార్క్స్ బాటలో సాగి,
నన్ను సామాన్య మానవుడిగా మలిచిన
నా సైంటిఫిక్ టెంపర్ అతడు.!
అన్నింటికి మించి
అమ్మ జీవంపోసి దేహమిస్తే,
ఎందుకు బతకాలో ఎలా బతాకాలో చెప్పి నాకు
ఆశయాల పునరుజ్జీవం పోసిన నాన్న అతడు.!
నాలో ఇలా నిండిన నాన్న
ఒకానొకరోజు నేను జైల్లో
ఉన్నది చూసి ఇదే అదుననుకున్నాడో ఏమో.!
మమల్ని వదిలి బుద్దుడిలా వెళ్ళిపోయాడు
నిజంగా నాన్న నాన్నే
నాన్నలాంటి వారు లేరు
మరోకరు రారన్న మాటల నిలువెత్తు రూపం
నాన్న ప్రతిబిడ్డకు హీరోనే
కాకపోతే నాక్కొచెం ఎక్కువ అంతే.!
(నలుగురి కోసం బ్రతికిన నాన్నలందరి యాదిలో)
- ఎం.విప్లవకుమార్