Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఒక్కసారి
నువ్వు,నేను ఓ మాటమీద నిలబడుదాం
చుక్కల్లాగా మారిపోయి
మచ్చలేని చంద్రుడిని
అసమానతలు లేని ఆకాశాన్ని దొరకబట్టుకుందాం
ఇప్పటిదాకా
మన మీద పడ్డ మరకలను తుడుపుకునేందుకు
అందరం కలిసికట్టుగా
చూపుడు వేళ్ళ మీది
సిరా చుక్కలమవుదాం
కడుపులో చిచ్చుపెట్టేవాడి
కథనిక ముగించుదాం
మన బాధల్ని, గాథల్ని
గుండెల మీద అచ్చు వేసుకునే వాడి
ఖాళీ డబ్బాలో
ఒకటో నెంబర్ గుర్తులమవుదాం
చీకటి రెక్కలను విరిచే
వెలుగు పక్షులమై
పోలింగ్ బూత్ భుజాలపై వాలుదాం
హామీలతో గాయపడిన మనసుకు
ఊరటనిచ్చే లేపనమవుదాం
మచ్చుకొకటి చూపడానికి
ఇయ్యాల్టి కళ్ళతడినంతా పోగేసుకొని
ఏమి మాట్లాడలేని మౌనంలోంచి
ప్రాణవాయువులను నింపే చెట్లమయి
కొత్తగా చిగురులేద్దాం
చిత్తు కాగితాలనేరి పారేసి
అసలు కాగితం మీదే
గుండెసంతకం చేద్దాం
- తండ హరీష్ గౌడ్,
8978439551