Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి లేనోడు
దుక్కి దున్ననోడు
విత్తనం పెట్టనోడు
కలుపు మొక్క వేరనోడు
పంట కొయ్యనోడు
కుప్ప కొట్టనోడు
ధాన్యాన్ని తూర్పార పట్టనోడు
ఎడ్లూబండి లేనోడే
మార్కెట్లో రైతు దగ్గర ఒకటికి కొని
బయట రెండుకు అమ్మే వాడు
పైపైన డబల్ సెబల్
లాభాల పంట తీసేవాడే దళారి
ఒక్క ఫోన్ కాల్‌తో
కోట్ల వ్యాపారం చేస్తుంటాడు
ప్రభుత్వం
వ్యవసాయ వనరులన్నిటినీ
సబ్సిడీకే ఇస్తుంది
పంటకు మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ
రైతు దినమింతా అప్పుల ఊబిలో
కూరుకు పోతున్నాడు
తిప్పల నుంచి బయటపడలేక
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
రైతుకు సంకెళ్లు విముక్తి
ఇక పొలంలోనైనా ఇంటి లోనైనా
మార్కెట్లోనైనా బోలెడు స్వేచ్ఛ
అమ్ముకోవడం అమ్మకపోవడం ఆయన ఇఛ్ఛ
అప్పుడు మార్కెట్ లో
ఇప్పుడు బిగ్ బజార్ లో మీరు నిలబడాలి అంతే
అప్పుడు దళారి ఉచ్చు బిగిస్తున్న ఇప్పుడు
పెట్టుబడి దారు డు ఉసురు తీస్తాడు
అమ్మే రైతుకు కొనే వ్యాపారికి మధ్య
వివాదం ఇక ఉండదు
ఉన్నా ఏ న్యాయస్థానం నమోదు
చేయలేదు గాక చేయలేదు
నమ్మండి చేసిన చట్టాలన్నీ మీ చుట్టాలే
మీ మేలు కోసమే
మీ నిరసన వెనుక
ఎగదోస్తున్న ప్రతిపక్షాలు
దేశద్రోహుల కుట్ర
ఉగ్రవాదుల హస్తం
నమ్మండి నమ్మండి నమ్మండి
మమ్ముల్ని నమ్మినవారు
ఎన్నడూ చెడిపోరు
అది మార్కెటే ఇదీ మార్కెటే
పెనం మీది దళారి చేతుల్లోంచి
బిగ్‌బజార్ పొయ్యిలో పడ్డట్టయింది
(వ్యాపారికి మధ్య వివాదం ఇక ఉండదు ఉన్నా ఏ న్యాయస్థానం నమోదు చేయలేదు చేయదు)
- జూకంటి జగన్నాథం