Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేము చదువులను
పొదువుకుంటే ...
నాలికె నరాలను తెంపి
చెవుల సీసం బోసి
గోసలు బెట్టిన
మతాలు వద్దే వద్దు.
మా విద్యల విలుకాడు
శంభూకున్ని సంహరించిన
మా విద్యల విరోధి
రాముడు వద్దే వద్దు
ఆలిని అవమానించి
అనుమాన సెరలు బెట్టి
అగ్గిల తోసిన మోసకారి మొగడు
రాముడు వద్దే వద్దు
మా జాతి రాణి తాటకమ్మను వేటాడిన
స్త్రీ హంతక రాముడు వద్దే వద్దు.
అలివికాని బలశాలి వాలిని
చెట్టుచాటు నుండి మట్టు పెట్టిన
కుట్రల రాముడు వద్దే వద్దు
మా జాగలకు వచ్చి
మమ్మల్ని మాంగ్ (కోతులు) లను చేసిన
ద్రవిడ జాతి ధ్వంసకార
రాముడు వద్దే వద్దు
ఆంజనేయున్ని ఆయుధంగా వాడుకొని
కాళ్ళకాడ కావలి ఉంచిన
నెనరు లేని రాముడు వద్దే వద్దు
పదారువేల పడతుల సరసుడు కష్ణుడు వద్దే వద్దు.
మా శూర్పణఖ ముక్కు చెవులు సెక్కిన
ముదునష్టం గాళ్ళు వద్దే వద్దు.
ఆవును గోమాతను జేసీ అందలం ఎక్కించి
ఆడోల్లను 'న స్త్రీ స్వాతంత్ర మర్హతి'లుగా చేసిన
మతము వద్దే వద్దు
సాటి మనుషులను అంటబడని పెంటలు చేసిన,
మతము వద్దే వద్దు
గుల్లెకి రానియ్యని గుదిబండ
మతము వద్దే వద్దు
సామాజిక వేత్తలైన
పోషమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారెమ్మలని
మహమ్మారీలని క్షుద్ర దేవతలని
తూలనాడే మతము వద్దే వద్దు
మా ఆడ మగ చరిత్రలను, శాస్త్రాలను సట్టుబండల్ని చేసిన మతం వద్దంటే.. వద్దు
మానవత్వ మరులు చల్లిన బౌద్ధాన్ని బతక నివ్వని
అమానవీయ కులం కూకటి వేళ్ళ
మతాలు వద్దంటే వద్దు
- జూపాక సుభద్ర