Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసంతా ఊహల ఉక్కపోత
పెయ్యంతా ఆలోచనల తలపోత
కవన ప్రవాహంలో తానం చేసేదాక
మనసుల మనసు నిలువది, నడువది
రాతపూతల మీద కుతి లేస్తే
అక్షరాలతో అల్లకం మొదలు పెడుతా
తోడ మీద పదాల తాడు పెనుతే
ఒరుసుకొని వాక్యం పురికదురుతది
నిద్రపట్టని నడి రాతిరి లేచి
దుప్పటి పాటి వ్యాసం నేయాలనుకుంట
చరిత్ర నూలు పోగుల సిర సరిచేసి
వర్ణ వర్ణాల దారాల ఆసుపోస్త
తెల్లారేవరకు తలుక్కుమన్న తెల్లనివస్త్రం
అక్షరాలు విరజిమ్మిన చిత్ర విచిత్రం
నల్లర్యాగట్ల ఇరువాలు మూడుసాల్లు
తెల్లకమ్మల నిండా కలం దున్నకం
మొలకెత్తిన ఇత్తునాలు, ఇరుగ కాసిన పద్యాలు
నడుస్తాంటే నడుస్తాంటేనే భావాల సుడులు
చెట్టునీడకుంటే పదచిత్రాల చక్కర్లు
ప్రయాణంలో నైతే ప్రాకృతిక వంపుసొంపులు
కవి జీవితంలో సాహిత్యం సల్లకవ్వం
- అన్నవరం దేవేందర్, 9440763479