Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకాలను అపురూపంగా చూసుకునేవారు, పుస్తకాలనుప్రేమించేవారు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా విడుదలైన పుస్తకాల కోసం ఎదురుచూసే వారికోసం, పాత, కొత్త పుస్తకాల ప్రపంచంగా ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ మీ ముందుకు వస్తుంది. దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఖ్యాతి హైదరాబాద్ పుస్తకప్రదర్శనకు దక్కుతుంది. ఇది హైదరాబాద్‌లో జరుగుతున్న 31 వ జాతీయపుస్తక ప్రదర్శన. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటి, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ బుక్‌ఫెయిర్ నిర్వహించబడుతుంది. పీజి నుంచి కేజీ వరకు తమకు కావాల్సిన పుస్తకాలు ఈ బుక్ఫెయిర్లో లభ్యమవుతాయి. అన్ని రంగాలకు, అన్ని శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. శిశువు నుంచి వృద్ధుల వరకు అన్ని కేటగిరీల సాహిత్యం ఒకే దగ్గర దొరకుతుంది. అన్ని భాషల పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి. భక్తి, ముక్తి, రక్తి, అనురక్తికి సంబంధించిన పుస్తక సామాగ్రి ఉంటుంది. ముక్తి నుంచి విముక్తి ఉద్యమాల వరకు సాహిత్యం లభిస్తుంది. రచనారంగంలో ఉన్న రచయితలకు, సాహితీవేత్తలకు, కవులకు, కవయిత్రులకు, కథకులు, నవలారచయితలు, వ్యాసరచయితలు సృజనకారులందరికీ ఇది బహుపెద్ద పుస్తకాల పండుగ. ప్రపంచవిజ్ఞానాన్ని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు దగ్గరకు) దగ్గరకు తీసుకవచ్చి మీ చేతికందించే ప్రయత్నం చేస్తున్నాం. ముగ్గులు వేసే మగువల దగ్గర నుంచి నూతన సమాజాన్ని నిర్మించే యోధులవరకు, సంచార జాతుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్వరకు, కూలీ నుంచి యజమాని వరకు అక్షరమాల నుంచి పోటీపరీక్షలకు హాజరయ్యే వారి వరకు, సబ్బండ వర్ణాల ఆశల ఆకాంక్షల కలయికల కేంద్రం ఈ పుస్తక ప్రపంచం.
సకుటుంబసపరివారంగా విచ్చేసి మీకుకావాల్సిన ఇష్టరీతిలో పుస్తకాలు పొందే అవకాశం ఉంది. ఈ పుస్తక పుష్పకవిమానం ఎక్కి విశ్వమంతా చుట్టి రావచ్చును. సమాజమార్పుకు, సమాజాల పునర్నిర్మాణాలకు ప్రధాన పనిముట్టయిన పుస్తకాన్ని దర్శించండి. ఆరోగ్యవంతమైన సమాజానికి పుస్తకమే ప్రాణం. మంచిపుస్తకాలు ఉత్తమ సమాజ నిర్మాతలు. పుస్తకాలతో చెక్కబడ్డ మనుషులే నవసమాజాల్ని నిర్మించారు. నవతకు, సమతకు దారి పుస్తకమే. సమాజంలోని అన్ని రుగ్మతలను తుడిచివేసేందుకు అధ్యయనమార్గాన్ని అవలంభిద్దాం. ఈ 11 రోజుల పుస్తకాల పండుగకు సాదర స్వాగతం. రండి. పుస్తక విశ్వదర్శనంలో పాల్గొనండి.
పిల్లలను తీసుకుని పెద్దలు, కుటుంబ సభ్యులంతా రావాలి. కొత్తతరం చేతికి ఈ పుస్తకాన్ని అందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలది, తరగతి గదులది, ఈ తరం పెద్దలది. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్సు నుంచి డిగ్రీ, పీజి కాలేజీల వరకు విద్యార్ధులు ఈ బుక్ఫెయిర్లో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లలను జాగ్రత్తగా ఈ బుక్‌ఫెయిర్‌కు తీసుకువచ్చే బాధ్యతను హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు తీసుకోవాలని కోరుతున్నాం.
- జూలూరు గౌరీశంకర్ ; అధ్యక్షులు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్
- బుర్రా వెంకటేశం ; ముఖ్యకార్యదర్శి, భాషా సాంస్కృతిక, టూరిజంశాఖ