Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి ఏం కలగన్నాయో
ఏం కలవరించాయో
ఈ పచ్చిక ఈ పచ్చని చెట్లు
ఈ ప్రకృతి
తెల్లారే సరికి ఒళ్ళంతా ఒక పులకరింత
ముత్యాల సంత
పొద్దుపిల్లగాడు
ముద్దైన ఎర్రని చేతులతో ఆడుకున్నట్లే ఆడుకొని
మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు
పొలాల పుస్తకాల్లో పచ్చని అక్షరాలు నాటుతున్న
పంట కవయిత్రుల మెడల్లో మాలలుగా
నుదుట సరాలుగా చెమట ముత్యాలు
పగటి ఎండనే పట్టు సెల్లాగా చుట్టుకొని
మన్నును వెన్నగా దున్నిన ఋషుల మేనుపై
అభిషేకించాడు ముత్యాలను
తమకు తామే నీడయి
తనువంతా యంత్రమయిన శ్రామికులపై
తాపడం వేయించాడు కొన్ని ముత్యాలు
తెలివి సంచుల్ని వీపున మోసుకుంటూ
తనతో పాటు గూడు చేరుతున్న పిల్లల ముఖాలపై
చినికించాడు చిట్టి ముత్యాలు
ఇంట్లో దీపం పెట్టుకున్నాక
చేతుల్లో పట్టుకున్న కంచాల్లో
మెతుకుల రాశిలా ముత్యాలు
ఉదయం తస్కరుడనుకున్నాం
మధ్యాహ్నం భాస్కరుడనుకున్నాం
రాత్రికి మాత్రం అమృతకరుడయ్యాడు
ఈ పచ్చిక ఈ పచ్చని చెట్లు
ఈ పొలాలు ఈ ప్రకృతి
ఈ రాత్రికూడా కలగంటూనే ఉంది
కలవరిస్తూనే ఉంది
రేపు తన బిడ్డలకింత అన్నం పెట్టాలని
- డా.గండ్ర లక్ష్మణ రావు, 9849328036