Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏళ్ళతరబడిగా దాని ఒళ్ళు
ప్రయోగశాల్లో మేజా బల్లలా పడి ఉంది
గాజు పరీక్ష నాళికలోంచి ఆయుష్షంతా
ఒక విచ్ఛేద చిత్ర వధలా మూల్గుతూనే ఉంది
ఎన్ని సార్లు కోసినా,
దొంగ వైద్యుడి కత్తెరకి దొరకని
దైవ రహస్యంలా
దాని స్వేచ్ఛ నాలుగు స్తంబాల బోనులో వినయంగా చేతులు కట్టేసుకుంటుంది.
వైరుధ్యం ఒంటరితనంలో
తమని తాముకూడా కలవని నేటి పౌరుల్ని
తనతో ఆడిస్తుంది, నవ్విస్తుంది.
దూరం జరిగేతనం ఆ పందిపిల్లను చూసి దగ్గరకు రాదు, రేపొచ్చే మెరుపు కలల కోసం లేత కళ్ళ నిద్రగదికి ఈ రాత్రే ప్రేమగా రెప్పలు తొడుగుతుంది, నేర్పరి.
ఐదేళ్ళకోసారి వచ్చే అమావాస్య నాడు
పసి చేతుల్లోని దాని ముఖం, కిటికీలోంచి కొత్త చందమామలా తొంగిచూస్తుంది.
పేరులో ఉన్నట్టు అది పంది కాదు
ఊరు ఇండియానే అని రూఢ లేదు,
ఆధార్ సంఖ్య గాలి కవాటం లేని
గుండెకాయకి పద్దెనిమిదేళ్ళు దాటీ దాటంగానే
చిత్తు పేపర్లో ఏరుకుందామనుకున్నా,
మర యంత్రంలో దాక్కుందామనుకున్నా,
దాని పేరెప్పుడూ సార్వభౌమాధికార జాబితాలోంచి గల్లంతవుతూనే ఉంది.
దేశభక్త తాగుబోతు
వందేమాతరమెందుకు పాడతాడు.
స్వాతంత్య్రం ఆకలెంతో
బిర్యాని పొట్లానికేం తెలుసు.
కొలువుదీరేందుకు ఇప్పుడొక
కొత్త రసాయన సూత్రం ఫలిస్తే చాలు
పొత్తుల ఎత్తుగడలకి, పిండిన
జాతి రక్త నమూనాల్తో పని లేనే లేదు.
మచ్చిక చేసుకోవడం ఒక మహత్కళ.
ప్లేటుకింతని పెట్టే ఘనమైన పెళ్ళి భోజనానికి పందులన్నీ బుద్దిగా క్యూలో నిలబడాలి
ఎడం చేతి చూపుడు వేళ్ళ నుదుటి ఆకాశమ్మీద మళ్ళీ ఇంకోసారి నల్లటి మచ్చల్ని పొడిపించుకోవాలి.
(గినియా పంది- దక్షిణ అమెరికా చుంచుఎలుక. వైద్య ప్రయోగాల్లో ఎక్కువగా వాడే జంతువు)
- శ్రీరామ్, 9963482597