Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి
ఎన్నెముక లెక్క ఉండి
ఎన్కబడిపోయి బతికెటోళ్ళం..
ఇంటికి మూలవాసం లెక్క
ఓ మూలకుండి
ఆకలి బరువును మోసెటోళ్ళం..
ఇప్పుడు మూలిగే నక్కమీద
తాటిపండు పడ్డట్లు..
సక్కగ నడిచే కాళ్ళల్ల
అడ్డంగ ఎవరో కట్టిర్కిచ్చినట్లు..
దేశం సమైక్యతా చిరునామై
స్వతంత్రం తెచ్చినోళ్ళ విగ్రహాలకు
ఊరి భూములు లాక్కున్నరు!
చెట్టుకొకలం పుట్టకొకలమై
ఉత్సవ ప్రసాదం సందంగ
పరిహారం కోసం ఉన్నపళంగ
పాలెగాల్లెట్క పడికాపులు గాత్తున్నం!
ఎవుసం జేసుడంటెనే
నవ్వెటోని ముందట్కి పోయి
ఎల్లెలుకల జారిపడ్డట్టు..
చారాణా పంటకు
బరాబరి బారాణా లాగోడి.
పాలల్ల పెర్గుతోడు కలిసున్నట్టు
రైతూ, కన్నీళ్ళు కలగలిసుంటరు!
ఉగులాడే ఉరికొయ్యలల్ల
కడగండ్లు పెనవేసుకొనుంటరు!
సమరయోధులయితే
చరిత్ర పాఠాల్లో చెప్పుకుంటం.
గుండెల్లో గుడికట్టి దాసుకుంటం.
శిల్పాల పునాదుల కింద
పచ్చని బతుకులనెట్లిడిసిపెడ్తం?
ఊకుంటె ఉసురు..
తగిలి పోతరనేది పాత సామెత !
ఊపిరి బిగపట్టి..
పోరాడి భూమిని గెల్సుడే నేటి కథ!!
(గుజరాత్లో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగ అరోజు 72 గ్రామాలు వంట మానేసిన భూనిర్వాసితుల తరపున..)
- అశోక్ అవారి, 9000576581