Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీపతి రాసిన మొదటి కథ (1956), రెండవ కథ (1957)లను వెతికి పట్టుకుని, వాటితో ఇటీవల రాసిన ఆయన మరికొన్ని కథలను కలిపి నవచేతనవారు 'యెంకి - నాయుడు బావ' పేరిట మరో కథా సంకలనంగా తీసుకువచ్చారు.
ప్రేమలు - పెళ్ళిళ్ళు, విఫల ప్రేమలు, ప్రేమ ఒకరితో పెళ్ళి మరొకరితో లాంటి కథలే ఇందులో ఎక్కువగా వున్నాయి. ఎందరినో జీవిత సంక్షోభాల మంటల్లోంచి తప్పించి కాపాడుతుంది ప్రేమ అని 'లలిత ఉత్తరాలు' తెలియజేస్తాయి. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల త్రికోణపు ప్రేమ కథలో ఎవరికి వారుగా మిగిలిపోవడమే 'ప్రేమలీల'. పిరికివాడైన ప్రియుడి కంటే, కోరి వచ్చిన వీరుడే మిన్నయని తెలుసుకున్న 'స్నేహలత'ది మరో కథ. మృణాళిని తన కాలేజ్ లెక్చరర్ పట్ల వున్న మూగ ప్రేమను వెల్లడించలేక, ఒక చలాకీ అమెరికన్ యువకుడితో 'పెళ్ళి చూపుల'ను ఓకే చేస్తుంది. తమ కుమార్తె ప్రేమను కాదంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని భయపడి, ఆ ప్రేమికుల 'పూలదండల పెళ్ళి'ని మహాకవి తాతాజీ ఆధ్వర్యంలో జరిపించి సంతోషపడిన తల్లిదండ్రులు ఇంకో కథలో కనిపిస్తారు. చిన్న వయసులో భర్త చనిపోతే, మోడులా మిగిలిపోయేకంటే, పునర్వివాహం చేసుకుని పిల్లలకు తండ్రిలేని కొరతను తీర్చాలి. ఆమె జీవితంలోని విషాదాన్ని 'కాలమే పరిష్కరించాలి'. కామంతో దిగజారకుండా 'పర్వదినాన' సోదర ప్రేమ ఆమెను కాపాడుతుంది. ప్రియురాలు పిన్నిగా మారిన వైనం 'సహృదయ'లో కనిపిస్తుంది. 'మోనాలిసా' అంటే ఎవరో అందగత్తె అని బుర్ర బద్దలు కొట్టుకుంటారు. చివరకు తప్పిపోయిన ఆ దిక్కులేని పాపాయే అందమైన మోనాలిసా అని తెలుసుకుంటారు. ఇల్లు కొనడానికి మారుమూల ఊరికి వెళితే పండ్ల తోటలు, ఆ తోటలకన్నా గొప్ప అందాలు మనుషులే అనిపిస్తుంది. తనకు నచ్చిన పాలరాతి యువతి లాంటి గిరిజన యువతి, ఏ దిక్కులేక తనతో ఢిల్లీని రావడం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది.
తల్లి చనిపోయిందనే విషయం తెలియని ఆ పసివాడి అమాయకత్వం 'పెద్దమంత'లో కనిపించి హృదయాలను కలచివేస్తుంది. భగవంతునికి కూడా వుంటారు శత్రువులు. ఆ శత్రువులే కొన్ని సార్లు మనకు మేలు చేస్తారని 'అమ్మా... అమ్మా' కథ చెబుతుంది. ప్రెసిడెంట్ దగ్గర కంచాలిగా వుంటూ చాలీచాలని జీవితం గడిపే కంటే, అక్కడి నుండి దూరంగా పారిపోయి కూల్ జీవితం గడపాలని నిర్ణయించుకున్న శ్రీరాములు 'మంచిరోజు'లో కనిపిస్తాడు. స్వరూప రచయిత్రిగా ఎదగడంలో కనిపించే సంభ్రమాశ్చర్యాలకు 'యెంకి - నాయుడు బావ' అద్దం పడుతుంది. ప్రణయోద్వేగాలు, భావుకత్వం, సౌందర్యపిపాస ఈ కథల నిండా పరుచుకుని వున్నాయి.
యెంకి - నాయుడు బావ (కథలు), శ్రీపతి, పేజీలు : 155, వెల : 110/-, ప్రతులకు : నవచేతన పుస్తక కేంద్రాలు
- కె.పి.అశోక్‌కుమార్, 9700000948