Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుదురుకోని అతుకుల బతుకులు
ఒక్కటై ఒక్కనినాదమై ఒక్కచోట
గుమికూడి వినిపించే
సమర ధ్వానాల వేదిక
మళ్ళీ ప్రాణం పోసుకుంది.
కన్ను పడింది
మదిలో అహం నిండిన
కర్కోటక పాలన సర్పం
బుసలతో విరుచుకపడింది
కబళించింది
అన్నెం పున్నెమెరుగని
అనాథ బిడ్డల అహోరాత్రాల
నిరసన గళాల అడ్డా!
ఊరుకుంటారా.
గోళ్ళు గిల్లుకుంటూ కూచుంటారా?
చైతన్యాగ్నిలో కరిగి కరకరలాడి
రూపుదాల్చిన నాగలికర్రుతో
వాతబెట్టారు
జనఘోషల్ని ఖాతరు చేయని
ఏలికల తిక్క కుదిర్చారు
ఇక కూచున్న గద్దెని కూలదోయ
జనం ధార ఉగ్రరూపమై ప్రవాహమై
ప్రళయరూపం దాల్చింది
ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం
విజ్ఞత కనబరచిన వివేకవంతమైన తీర్పు
మలి ఉద్యమాల వేదికకి
మంత్రసానిలా పనిచేసింది
హక్కుల కోసం
పురివిప్పిన ఆందోళనల పర్వంకోసం
ధర్నాచౌక్ పురిటినొప్పులు పడుతోంది
ఉద్యమ భాస్కరుని అవతరణ అనివార్యమై
ప్రజాస్వామ్య మనుగడగీతమై
ప్రపంచం నలుమూలలా మార్మోగేలా
గర్జించనుండి సవరించుకొన్న కంఠధ్వనుల్తో!
జయం జయం! జనం జయం!!