Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకి పోయిన జ్ఞాపకాలన్నీ
అదను చూసి
మొక్కల్లా మొలకెత్తుతాయి!
ఒక మెట్టు ఎదిగి
అహం హద్దులు మీరినప్పుడల్లా
పాదాల కింది నేలను గుర్తు చేస్తాయి!
మధ్యంతర సిరి
మనిషిని ధ్వంసం చేస్తున్నప్పుడల్లా
వెనుతిరిగి చూసుకొమ్మని హెచ్చరిస్తాయి!
అందరూ చుట్టే ఉన్నా
నా ఆకలి కేకలెవ్వరూ వినిపించుకోనప్పుడు
లేని మా అమ్మను యాజ్జేస్తాయి!
పిల్లల అవసరాలు
తీర్చలేక విఫలమైనప్పుడు
కకావికలమైన మా నాన్న ముఖాన్ని పట్టిస్తాయి!
అవసరానికి
తిరిగి తిరస్కతుల దరి చేరినప్పుడు
నీ ముఖమిప్పుడు ఎక్కడ దాస్తావని ప్రశ్నిస్తాయి!
అన్నీ వదలుకుని నా వెంటొచ్చిన
ఆమెకు ఆత్మీయతను పంచనప్పుడల్లా
నీదీ ఒక బతుకేనా అని వెక్కిరిస్తాయి!
ఉడికీ ఉడకని వాక్యాలను
యావతో అచ్చుకు పంపుతున్నప్పుడల్లా
మహా కవి మాటల్తో కొరడా ఝళిపిస్తాయి!
జ్ఞాపకాలిట్లా
నన్ను వెంటాడుతున్నంత సేపు
ఒక హితునితో జతగా నడుస్తున్నట్లే ఉంటది!!
- కోట్లవెంకటేశ్వర రెడ్డి, 9440233261.