Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందేపి రాణీప్రసాద్ అంటే ఇప్పటి వరకు బాలసాహితీవేత్త. సైన్స్ రచయిత్రిగానే అందరికీ పరిచయం. కాదంటే హాస్పటల్ వ్యర్థాలతో అందమైన కళాకృతులు తయారు చేసే ఒక సృజనకారిణిగానే తెలిసి వుంటుంది. కానీ తన తొలి కవితా సంపుటితో మరో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఉత్తమ రచయిత్రిగాగా కీర్తి పురస్కారం కూడా అందుకున్నారు.
సిరిసిల్లలో సాహితీ సంస్థలకూ, సాహిత్యకారులకూ పరిచయం అక్కర్లేని పేరు డా||కందేపి రాణీప్రసాద్. నాలుగు దశాబ్దాలుగా ఆమె సాహితీ సృజన చేస్తున్నారు. 'హౌస్‌వైఫ్' ఆమె తొలి కవితా సంపుటి అయినప్పటికి ఆ కవిత్వంలో చదువరిని గాఢంగా హత్తుకునే విశాలమైన భావుకత, సాంద్రమైన కవిత్వం వుంటుంది. ఈ వచన కవితా సంపుటి కవన పొరల్లో జీవం నింపుతుంది. ఇందులో సమకాలీన, సార్వకాలీన అంశాలపై 96 కవితలున్నాయి.
'హౌస్‌వైఫ్' కవితలో ఇల్లాలి పరిస్థితిని కవిత్వీకరించారు. ''ఇంటిల్లిపాదికీ/ కాఫీ టిఫిన్లై పలకరించి/ అన్నమై ఆకలి దీర్చి/ క్షణమైనా ఆగని గడియారపు ముల్లులా/ ఇల్లంతా తిరుగుతూనే వుంటుంది'' అని ఇల్లాలి పై కవిత్వం రాశారు. హాస్పటల్ ఎం.డిగా వుండటంతోనో లేకపోతే సైన్స్‌పై ఆసక్తితోనో 'ఫస్ట్ ఎయిడ్ బాక్స్'ని ఇంత అందంగా ఎవరూ వర్ణించలేదేమో. ''ఊరంతటికీ అన్నం పెట్టే రైతన్నలాగా/ జీవితాలకు అక్షర జ్ఞానాన్నిచ్చే టీచర్‌లాగా/ కుటుంబాలకు ఆరోగ్యాన్నందించే ఆప్తుడితడు'' అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను రైతులాగా, టీచర్‌లాగా, స్నేహితుడిలాగా వర్ణించడం ఆమెకు సాధ్యం. ''బిడ్డ బాగోగులే అమ్మ లోకం!/ బిడ్డ ఆలోచనలే అమ్మ ప్రాణం'' అనే 'అమ్మకు వందనం' కవిత. మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ర్యాగింగు దుర్మార్గాన్ని విమర్శిస్తూ ''గుండె చప్పుడే కాదు గూడు కట్టుకున్న/ బాధల్నీ పారద్రోలే స్టెతస్కోపు మంత్రదండాన్ని/ అందుకున్న చేతులు మీవి!/ అలా పదిమందికి ప్రాణదానం చేయాల్సిన చేతుల్ని/ ర్యాగింగ్ కేసుల్లో సంకెళ్ళు వేయించి జైళ్ళకు బలి చేయొద్దు!'' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంకా ఈ కవితా సంపుటిలో మంచినీళ్ళ కరువు తీర్చే చెరువును వర్ణిస్తూ 'మా ఊరి చెరువు, బస్సు ఆత్మ, విజ్ఞాపన పత్రం, నగరంలో బాల్యం, అన్న ప్రాసన, చింతచెట్టు' వంటి కవితలు, 'వైద్య బతుకమ్మ'లో బతుకమ్మ గేయం ఇలా ఎంతో అక్షరాల సంపద ఈ కవితా సంపుటిలో ఉంది. గాయపడిన మనసుకు స్వాంతన చేకూర్చే ఆపద ధన్వంతరి ఈ 'హౌస్‌వైఫ్'.
హౌస్‌వైఫ్, కందేపి రాణీప్రసాద్, పేజీలు :162, వెల :150/- , ప్రతులకు : స్వాప్నిక్ ప్రచురణలు, సృజన్ హాస్పటల్, ఓల్డ్ బస్టాండ్, సిరిసిల్ల - 505301.
- అనంతోజు మోహన కృష్ణ, 8897765417