Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరికోసం?
పవిత్రతలు మనసున్న మనుషులవా....
శరీరాలు తొడుక్కున్న ఆత్మలవా?
శాంతిమంత్రాలకు శవపేటిక తయారుచేసి
ఏంసాధిద్దాం?
చెట్టు తన కొమ్మను తనే నరికేసిన దాఖలా
ఎక్కడా కనబడదు!
ప్రకృతిభాషకు దూరంగా నెట్టివేయబడుతున్న వాళ్ళం!
చెదలు నిండిన దేహాలను మోస్తున్నవాళ్ళం!
పత్రహరితం నిండిన పచ్చని చెట్ల తొడుగులెందుకూ?
లోపలంతా డొల్లతనం
కుళ్ళిన మెదళ్ళు స్రవించే
రసాయన ధారలు కురిపిస్తూ...
పచ్చని పంటలను మింగేస్తున్న వాళ్ళం..
పురుగుల్లా పుట్టుకొస్తున్న వాళ్ళం
మనకు మనమే కరువైతున్న వాళ్ళం
ఇంకెందుకీ ముసుగు!!
కరువులో కొట్టుకుపోతూ
స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసి
మందుల్లో ముంచి ఆహారపు రూపుమార్చి
పొరలుకమ్మిన మనసుతో శుద్ధమైన ఆరోగ్యాన్నీ
దహించుకుంటున్న వాళ్ళం!
దయాగుణాన్ని చేతులార వదిలేసుకుని
సంపూర్ణ ఆయుస్సునూ
తరిగించి
రోగగ్రస్థమైన దేహాలతో త్వరత్వరగా మరణించడానికి
ఇన్ని ముసుగులెందుకు
ఇంత నాటకమెందుకూ!!
- అరుణ నారదభట్ల