Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బతుకమ్మ' తెలంగాణ వ్యవసాయ సంస్కృతి నుండి ఆవిర్భవించిన ఉత్సవం. ప్రకృతికి, మహిళకు వున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. బతుకమ్మ పూల పండుగే కాదు, ఆటల పండుగ, పాటల పండుగ. కోలాటాల పండుగ. అన్నింటికి మించి ఆడపిల్లలకు ఆటవిడుపు పండుగ. బతుకమ్మ పండుగ ముందుగా మట్టి బొడ్డెమ్మలతో మొదలై భాద్రపద అమాస అంటే పెత్తరమాస నాటికి 'బతుకమ్మ'గా రూపుదిద్దుకుంటుంది. ముందుగా బతుకమ్మ పండుగ పుట్టుపూర్వోత్తరాలు, ఆ పండుగ విశిష్టత, బతుకమ్మకు ఉపయోగించే పూలు, పేర్చే విధానం, ఆ పండుగ సందర్భంగా చేసే సద్దులు, ఆడే విధానం, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కనిపించే పూల పండుగలతో పోల్చి చూపించారు.
రెండవ అధ్యాయం 'కుటుంబ సంబంధ గేయాలు'లో పెండ్లితో స్త్రీల జీవితం ముడిపడిన అంశంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పెళ్ళిళ్ళ తీరుతెన్నులు, అత్తింటి ఆరళ్ళు, పుట్టింటి ప్రేమలు, స్త్రీ ధర్మాలు, మాతృత్వానికి సంబంధించిన అనేకాంశాలు కలిగిన పాటలు, వాటి వివరణతో ఇచ్చారు. జీవితాలతో పెనవేసుకునే సందర్భాలను హాస్యంగా మలచుకుని ఆనందాన్ని, అనుభూతిని పొందడం 'పరిహాస సంబంధ' గేయాల్లో కనిపిస్తుంది. సమాజంలో వస్తున్న మార్పులు కుటుంబంపై ఎలాంటి ప్రభావం వేస్తుందో వాటిని ప్రతిఫలిస్తూ 'సామాజిక సంబంధ' గేయాల్లో వాటిని వివరించడం చూడవచ్చు. తాము నమ్మిన దేవీదేవతల కథలు, పూజా విధానాలు, విశ్వాసాలతో పాటు కార్యాకరణ సంబంధం లేని విషయాలను 'భక్తి విశ్వాస అద్భుతాంశ సంబంధ గేయాల్లో' ఇమడ్చడం కనిపిస్తుంది. పాటల పరిణామ క్రమంలో 'రాజకీయ సంబంధ గేయాలు' కూడా చొచ్చుకొని వచ్చినవి. వాటిలో మొదటగా ప్రస్తావించదగినవి తెలంగాణ రైతాంగ పోరాట గాథల గేయాలు. ఈ గేయాలు దొరల దురాగతాలను, వాటిపై పోరాడాల్సిన స్థితిగతులను, పోరాట క్రమాన్ని తెల్పడం ద్వారా ప్రజలకు పోరాట అవసరాన్ని, అవగాహనను కల్పిస్తూ ఆ పోరాటానికి వారిని సన్నద్దం చేసిన విధానం కనబడుతుంది. అంతే కాకుండా స్వాతంత్య్రోద్యమ అనంతరం గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీల పట్ల అభిమానంతో వాళ్ళను ప్రస్తుతించడాన్ని కూడా బతుకమ్మ పాటలుగా మలచుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి కూడా బతుకమ్మ పాటలు వాహికగా నిలిచాయి. ఇవే కాకుండా బతుకమ్మ పాటలు ఎన్నో విభిన్న విషయాలను తమలో పొందుపరుచుకున్నవి.
మొదటి నుండి బతుకమ్మ పాటలు మౌఖికంగా ఉండటం వలన, అవి కాలానుగుణ మార్పులకు లోను కావడం వలన ఒకే పాట వివిధ స్థలాలలో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మౌఖిక స్థాయి నుండి పాటలు లిఖిత రూపంలోకి వస్తున్నాయి. సామాన్యంగా బాగా నలిగిన పాటలనే పాడుకోవడానికి ఇష్టపడే మహిళలు సరళమైన భాష, రాగం, లయ వున్న పాటల పట్ల కూడా ఆసక్తి చూపగలుగుతున్నారు.
''తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం'' అన్న ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని రచించిన డాక్టర్ తిరునగరి దేవకీదేవి ఎంతో శ్రమించి, వందలాది పాటలను సేకరించడం ఒక ఎత్తు, వాటిని విభజించుకుని, విశ్లేషించడం మరో ఎత్తు. పదకొండేళ్ళు కష్టపడి ఈ ప్రామాణిక పరిశోధనా గ్రంథాన్ని రూపొందించడంలో దేవకీదేవి చూపిన కార్యదీక్ష, నిజాయితీ నిబద్దతలు భావి పరిశోధకులకు ప్రేరణగా నిలుస్తాయి.
బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు - పాటల పరిణామక్రమం, డా||తిరునగరి దేవకీదేవి, పేజీలు : 487, వెల : 300/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- కె.పి.అశోక్‌కుమార్,
9700000948