Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరమెచ్చుల ఉచ్చులు
స్పందించడం ప్రతిసారీ నిందించడంగా భావించబడుతుంటే ఆనందించడం ఎలాగ, దాన్ని? ఇతరుల మెప్పు కోసం సతతం సాగే వెంపర్లాట - అదొక మసిపూసి చేసిన మారేడుకాయల తోట. మధురవ్యాఖ్యల మాటలు మంచి వాక్యాల ఊటలు మనను చుట్టుముట్టాలనీ, పులకరింతల్ని రేపే పలకరింతలతో తబ్బిబ్బైపోవాలనీ ఒక ఆరాటం లోలోపల పోరాటం చేస్తుంటే దాన్ని గెలవలేక మిగిలిపోతాం నిస్సహాయంగా. రంగుపొరల్లో చుట్టిన మాయమాటలు భంగులాగా మన(సు)ను మత్తులోకి విసిరేస్తరు, నిజమే. కాని, ప్రమోదకరమైన వ్యాఖ్యల్ని ప్రయత్నం చేసి తెచ్చుకోవటంలో పస ఏముంటుంది? బయటి వత్తాసు వున్నా లేకున్నా లోపలి సత్తాకు ఢోకా లేకపోవటమే కోరుకోవాలి మనం. కనక సదృశమైనదేదో మనలో వున్నా మనకు మనమే సాటి అనుకోలేం కనుక వెనుకబెంచీ మీద కూర్చునేందుకు ఎందుకు కినుక అందుకే అంటున్నా, ముందర వున్న ధ్యేయం మీదనే మనమందరం దృష్టి సారించాలని. తక్కినవన్నీ అక్కరకు రానివని.
- ఎలనాగ,
9866945424