Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాయినమ్మా
అప్పుడు నువ్వు సచ్చిపోయిందే మంచిదైందే.
నాలుగుపోగులుగ జేసి
నెలకొక్కరి సొప్పున
నిన్ను నీ కొడుకులు పంచుకోకముందే
నీ తొవ్వను నువ్వు జూసుకొని
కట్టుబట్టలతో వెళ్ళిపోవడమే మంచిదైంది.
మురికిగుడ్డల్లో పడి నవిశినప్పుడు
ఎవ్వరూ ఎత్తిపోయలేక
కంపుగొట్టే మాటలు అనకముందే
పండుకున్నదానివి పండుకున్నట్టే
తెల్లారకముందే వెళ్ళిపోవడమే మంచిదైంది.
సీరియళ్ళ సోకులో పడి
పొయ్యిమీద పొంగుతున్న పాలలాగే
నిన్ను కూడా నేలపాలు చేయకముందే
సూర్యచంద్రులకు పాలియ్యడానికి
సర్రసర్ర నడిచి పోవడమే మంచిదైంది.
పైసలచెట్టు నీడన బతికే కొడుకుల చేతుల్లో
చెల్లనినోటువై
గుడిముందల పగిలిన మెట్టుగా మారకముందే
వాకిండ్లు ఊడ్వడానికి వెళ్ళినట్లు
కోడికూయక ముందే వెళ్ళిపోవడమే మంచిదైంది
ఆసుపత్రులన్ని
నీ నెత్తురును తాగకముందే
అక్కడి గాలి సోకకముందే
సుక్కల్ని కలిపి ముగ్గేయడానికి
కానరాని రాజ్యానికి వెళ్ళడమే మంచిదైంది
మనుమడిని సంకనెత్తుకొని
ఊరంతా తిరుగుదామనుకున్న నీ ఆశను
సంపుకోవడమే మంచిదైందిలే.
చెవుల్లో ఏయిర్ ఫోన్లు మొలిచిన
ఇప్పటి పిల్లలకు
నీ దగ్గర ఆడుకునేంత తీరికెక్కడుందని
బొడ్లోసంచిని చేసుకొని
కడుపున దాసుకునే నా ప్రేమ ఎవరిగ్గావాలని
అలిగిపోవడమే మంచిదైంది నాయినమ్మా!
నాకు నౌకరివచ్చిందాక బతికుంటే
రైకగుడ్డనో, చీరబట్టనో పెట్టెవాడినని
పానమంతా కొట్టుకుంటుంది గానీ
మమతలు కరువైన ఈ కరువుకాలంల,
అట్లా ఎగవడి
కూలీకోయినట్లు పోవడమే నయమైంది
- తగుళ్ళగోపాల్