Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది సరళక్క కొడుకు కవిత్వం. కాసుల రవి గురించి కొద్దిసేపు పక్కనపెడతాను. ఆ ముసలవ్వెవరో పోల్చినట్టు, పక్కనున్న విజయత్తమ్మ, పక్కింటి శారద పిన్ని గుర్తుపట్టినట్టు ఆ వాక్యం కాలర్ పట్టుకుని ఒక మాట చెబుతాను. ఇదంతా బతకడమనే గొప్ప విషయాన్ని, విజయం చేసిన అమ్మ చేతుల్తో రాసిన కవిత్వం. కాదనే ధైర్యమే లేదు. ఇది రవి మొదటి కవిత్వ సంపుటి. 48 వచన కవితలున్న ఈ పుస్తకంలో మనల్ని ఈ సరళక్క కొడుకుతనంతో రాసిన కవిత్వమే ఆకర్షిస్తుంది. ఏమిటా వైయిక్తికత? అది మనుషులమీద అతనికున్న నమ్మకమూ సెంటిమెంటేనేమో! అభివ్యక్తిలో మహా సరళత, భావానుభూతి కలిగించడంలో అతను వాడిన నిరలంకార భాష ప్రధానమైన పనిముట్లుగా ఉంటాయి.
స్థూలంగా వస్తుగత కావ్య పరిమళమే కవితలనిండా కనిపిస్తుంది. ఆసిఫా లాంటి ఆడపిల్లల గురించి, అంబేద్కరిజం, వృద్దాప్యం, మహిళా దినోత్సవం, పనిచేయని ఆసుపత్రి, ఆడకూతురుండాలనే కోరిక, చదవలేక పాట్లు పడుతున్న బాల్యం గురించి.. చాలా చాలా వైవిధ్యమైన వస్తువులున్నాయి. తారే జమీన్ పర్ అంటాడు, నీదీ నాదీ ఒకే కధ అని కూడా అంటాడు. సమకాలికత మెయిన్టెయిన్ చేస్తాడు. మరింకేంటి? అంతా బావున్నట్టే కదా? అలా అని అనాలనిపించదు. ఎందుకనంటే కవితా వాక్యాల్లో ఇందాకనుకున్న నిరలంకారత స్పష్టమైన కావ్య లక్షణంగా కనిపించినప్పటికీ ఉద్వేగ ప్రకటన తక్కువగా ఉంటుంది. ఆధునిక వచన కవిత్వంలో ఉపమాలంకారముందా, ఎక్కువగా రూపకముందా అనే అసందర్భ ప్రసంగమైతే చేయలేను కానీ, నిరలంకారతలో కూడా వ్యావహారిక భాషా సౌందర్యం ఒక వేగాన్ని కలిగి చటుక్కున మనల్ని ఆకర్షిస్తుంది. అలాంటి కవితలు నేటి యువ కవులు ఎక్కువగా రాస్తున్నారు కూడా. ఆ లక్షణం 'అమ్మో కవిసమ్మేళనం' అన్న కవితలో బాగా ధ్వనిస్తుంది. చదవడం పూర్తిచేశాక పాఠకుడు ఒక ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోవల్సిన అగత్యముంటుంది. మంచిది కద. అలాగే ఏటీయం, పిల్లలంతా జై అన్నారు, అమ్మాయా అబ్బాయా లాంటి కథనాత్మక పద్ధతిలో ఉన్న కవితలు కూడా ఒప్పుకునేట్టుంటాయి. అక్కడే అతని శైలేమిటో మనకి దొరుకుతుంది. ఈ అలిగోరికల్ నిర్మాణ లక్షణం మెచ్చుకోతగ్గది. అలాగే కాన్వర్షేషనల్ టోన్ కలిగి ఉండటమూ మనం సులువుగా కనిపెట్టగలుగుతాం. అయితే ఈ రెండు ప్రధాన లక్షణాలతో నేటి కవిత్వ సృజనశీలుర మధ్య నిలబడే సాహసం కవి చేయగలడా?
ఈ కవి కవిసంగమం చెట్టు మీద కూత నేర్చిన పిట్ట. ఆ ప్రేమని ''వెల కట్టలేని ప్రోత్సాహం, చక్కటి విమర్శలు, వాడీ వేడిగ చర్చలు, ఇదొక సాహితీ విశ్వ విద్యాలయం'' అని రాసుకుంటాడు. కృతి స్వీకర్త యాకూబ్ కూడా ''కవి అంతర్బాహి ప్రపంచాల మధ్య కళ్ళు తెరిచే లోపలి మనిషి'' గురించి చాలా బాగా ఉదహరిస్తాడు. సైకిల్ శవ యాత్ర, ఆ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి లాంటి కవితలు అతనిలోని సామాజికుణ్ణి చూపిస్తాయి. 'ఫారెస్ట్ ప్రూవుడ్, నాలో సగం' కవితలు చాలా బాగుంటారు. సింపుల్గా ఉన్నప్పటికీ గంభీర విషయ ప్రస్తావన చేస్తాయి. కవిత్వ సాంద్రత, సౌకుమార్యం రెండూ చదివిస్తాయి. ''రాజీ పడని సెన్సారు బోర్డు ఆమె, ఆమె విమర్శ సర్జికల్ బ్లేడుకన్నా పదునైనది, ఆమె పొగడ్త పది నోబెల్స్తో సమానం'' లాంటి వాక్యాల్ని ఇష్టపడకుండా చదవలేం.
ఇదింకా కవి, కవిత్వం రాస్తున్న కొత్తదనాన్ని దాచలేకపోతున్న పుస్తకం. అతనే చెప్పుకున్నట్టు ''పగలూ రాత్రి, చలిలో వానలో, పదాలతో కుస్తీ పడుతూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ, రాస్తూ, సరిచేస్తూ, మురిసిపోతూ'' అంటాడు. అంతవరకూ ఇబ్బంది లేదు. కేవలం మురిసిపోవడం దగ్గర ఆగిపోతే ప్రమాదంలో పడతాడు. విప్లవకారుడు లాంటి కవితని రెండు సంవత్సరాలు ఎడిట్ చేశానని చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎడిట్ చేయడమంటే లోతుగా ఇంకా తెలుసుకోవల్సిన అవసరం ఉంది కవికి. వస్తు ఎంపికలో, దాన్ని చూసే చూపులో, నిర్మాణ కుశలతలో నీదైన ముద్ర, పద ప్రయోగంలో తాజాదనం, అసలు మొత్తంగా నువ్వు చదువర్లని మెప్పించే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కోసం ఎడిటింగ్ చాలా చాలా సద్వినియోగ పరుచుకోవల్సిన ప్రక్రియ. అది ఎవ్వరి వాక్యంలోనైనా ప్రతిఫలించడం చాలా సులువు. కనుక రవి కవిత్వం పట్ల తనకున్న అపారమైన అనురక్తిని ఇలానే ఉంచుకోవాలి. ఇప్పటిదాకా వివిధ కవిత్వ లక్షణాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూపిన కవిత్వాన్ని చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు కవిత్వపరమైన హేతువులు కొత్త పాఠాలు నేర్పుతాయి. అతనికిష్టమైన కవి మాటల్లో మననం చేసుకోవాలంటే ''తమ్ముడూ బహుపరాక్, దేశాకాశంలో రాబందుల రెక్కల చప్పుడు. స్వర్ణ దేవళం కోనేటిలో నెత్తురు జలకాలాడిన రాబందు. జాప్ ఫూ పర్వత శ్రేణుల్లో కపాల నృత్యం చేస్తోన్న రాబందు. జాఫ్నా నెత్తురు దోసిళ్ళతో తాగే రాబందు'' (జాగ్తే రహో) లాంటివి రాబందులపై యుద్ధం చేసే నమ్మకంతో చదవాలి. అప్పుడు కొత్తతరం గొంతు విని పుడమి పులకరిస్తుంది. కడలి కనులు తెరుస్తుంది. జీవితం ఒంటరిగా చిందించిన రక్త ధార, కొత్తతరం గొంతు విని ప్రభవించే కాలానికి కొత్త సూర్యోదయమవుతుంది. నిన్ను గూర్చి నన్ను గూర్చి నిఖిల సృష్టిలోని ఖిలం గూర్చి నీరవ సుందర హృదయపాత్ర నిండిన హలాహలం గూర్చి, కవిత్వం నిజం చెప్పమని నిలదీస్తుంది. నీ కవిత్వంలో నువ్ దొరికిపోతావ్రోరు తమ్ముడా!
- శ్రీరామ్,
9963482597