Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిచ్చుకల అరుపులతో
మా లాన్లోకి తొంగిచూసాను
తులసిమొక్కను అంటుకున్న గొల్లభామతో
గులాబీ పువ్వుపై వాలిన సీతాకోక మంతనాలు
సాలీడు సన్నని తీగల
సరిగమలు పలుకుతూ
కుండీకి మొక్కలకు
మధ్య వారధయ్యింది
ఏంటీ సంగతి అంటూ
ఒక తీగను అటూ తీసింది,
గుట్టుగా గుసగుసగా చెప్పుకుంటున్నాయి
జామ పండు రాలిన శబ్ధానికి
అన్నీ గొంతు సవరించుకుంటూ వాటి వాటి స్థానాలకు ఎగిరిపోయాయి
నాలుగు ఆకులు అక్కడ రాలిపడున్నాయి
వాటిపై ఇలా రాసుంది
కామ్రేడ్..
స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అంటూ
ఏవో జెండాలు ఎగరేస్తున్నారు
ఈ జనాలు అప్పుడప్పుడు,
మనకెప్పుడవిజి
గింజల్లేవు
నీళ్లు లేవు
చెట్లు లేవు
మట్టి లేదు
కానీ మనముండాలి వాళ్ళకి
పంజరాల్లో బొమ్మల్లా
మన మ్యానిఫెస్టో ప్రకారం
వాటిని నిరసిస్తూ
ఈ రోజు శీతాకాల సమావేశం
గూళ్లకు చేరేముందే అందరం
పొన్న చెట్టు నీడన ఒక సందేశాన్ని అన్నివైపులా చేరవేయాలంటూ....
అది చదివిన నా కళ్ళు చెమర్చాయి
ఆకాశం కూడా చెమ్మగిల్లినట్లుంది
సన్నగా వర్షం
ఆ రోజు నుండి
మా ఇంటి వసారాలో మట్టి ,చెట్లు, పూలు,రకరకాల జీవాలు
వాటి సమావేశాలన్నీ
నా ఇంటి గుమ్మంలోనే...
- సుభాషిణి తోట